Doctors as leaders : లీడర్లుగా.. డాక్టర్లు..!
- వైద్య సేవలు వదిలి.. రాజకీయాల్లలోకి డాక్టర్లు
- సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతూ ప్రచారాలు
- రాజకీయం వైపు అడుగులు వేస్తూ ముందుకు..
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను..’ సాధారణంగా సినీరంగంలో ఉన్న చాలా మంది నటీనటులు ఇలాంటి డైలాగ్స్ కొట్టడం మనం వినే ఉంటాం.. వైద్య వృత్తికి ఉండే గుర్తింపు, గౌరవం అలాంటిది మరి..! జనం కూడా డాక్టర్‌ను దేవుడితో సమానంగా చూస్తారు. కానీ.. జనగామ జిల్లాలో మాత్రం వింత పోకడలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు తమ వైద్య వృత్తిని పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాలని ఆరాటపడుతున్నారు. డాక్టర్లకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నిస్తే.. ప్రజాసేవ చేసేందుకే అనే జవాబు వినిపిస్తోంది. అయితే అంగ బలం, అర్థ బలం ఉన్న వారే లీడర్లగా చెలామని అవుతున్న ఈ రోజుల్లో ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు రాజకీయాల్లోకి ఎంట్రీలు ఇస్తుండడం స్థానికంగా చర్చణీయాంశంగా మారుతోంది. కొన్ని రోజులుగా ప్రధాన పార్టీల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని పలువురు డాక్టర్లపై ‘చౌరాస్తా’ స్పెషల్ స్టోరీ…
జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గం నుంచి ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్య మంచి పేరున్న పిల్లల డాక్టర్. ఈయన రాజకీయాల్లోకి రాకముందు హన్మకొండలో హాస్పిటల్ నిర్వహించే వారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ వృత్తిని కొనసాగించలేకపోయారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న డాక్టర్ సాబ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ మొండి చేయి చూపింది. రెండు రోజుల కింద ప్రకటించిన 2023 ఎమ్మెల్యే టికెట్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇదే నియోజకర్గం నుంచి మరో ఇద్దరు డాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకరు ప్రస్తుతం జనగామ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు, మరొకరు పట్టణంలోని ఎస్‌ఎస్‌కే హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ బొల్లపెల్లి కృష్ణ. ఇక జనగామ నుంచి మాజీ కర్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, పాలకుర్తి నుంచి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్ చట్టసభల్లోకి అడుగుపెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
‘పగిడిపాటి’ వ్యూహాలు..
డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు సతీమణి సుధ ఇప్పటికే జనగామ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా సేవలందిస్తున్నారు. అయితే ఆమెతో పాటు ఆయన కూడా ప్రత్యేక్ష రాజకీయాల్లో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ డాక్టర్ అయినా ఆయన బీఆర్‌ఎస్ కార్యక్రమాలను వెనుక ఉండి నడిపించడంతో పాటు పార్టీ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉంటుంటారు. ఈయన త్వరలో వీఆర్‌ఎస్ తీసుకుని పూర్తి స్థాయిలో రాకీయాల్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. మొత్తానికి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న వర్గపోరును తనకు అనుకూలంగా మార్చుకుని టికెట్ కోసం పగిడిపాటి ముమ్మర ప్రయత్నాలు చేశారు. కానీ, బీఆర్‌ఎస్ అధిష్ఠానం కడియం వైపు మొగ్గు చూపింది. అయితే రాబోయే రోజుల్లో సుగుణాకర్‌రాజుకు మంచి అవకాశం ఇస్తామని పెద్దల నుంచి హామీ అందినట్టు తెలుస్తోంది.
సేవా తత్పరుడు ‘కృష్ణ’
డాక్టర్ బొల్లపెల్లి కృష్ణ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చారు. జనగామలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈయన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండలం కోమల్ల వాసి. చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటారు. కోవిడ్ టైంలో చేసిన సేవలకు డాక్టర్ కృష్ణ 2021లో కేంద్ర సామాజిక సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు. రాజకీయ నాయకుడిగా అయితే ప్రజలకు మరింత సేవ చేయొచ్చు అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యకర్తల మంచిచెడుల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సక్సెస్ కోసం కీలకంగా పనిచేసిన కృష్ణ ఎమ్మెల్యే టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలిసింది.
సైనికుడు.. సమాజ సేవకుడు ‘మాచర్ల’
మాజీ కర్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి.. ఎంబీబీఎస్, ఎండీ (జనరల్ మెడిసిన్) డాక్టర్‌గా ఆర్మీలో కర్నల్ హోదాలో పనిచేసిన ఈయన సొంతూరు పాలకుర్తి నియోజకవర్గంలోని బమ్మెర గ్రామం. సుదీర్ఘ కాలం దేశ సరిహద్దులో డాక్టర్‌గా సేవలందించిన భిక్షపతి సొంతూరు కూడా ఏదైనా చేయాలనే సంకల్పంతో వీఆర్‌ఎస్ తీసుకుని వచ్చేశాడు. ఆ తర్వాత జనగామలో ఆస్పత్రి ఏర్పాటు చేసుకుని వైద్యసేవలందిస్తున్నారు. ఈయన సామాజిక సేవతో పాటు చైతన్య కార్యక్రమాలు, సాహిత్య ప్రియుడిగా సాహితీ రంగానికి సేవలు అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముదిరాజ్ బిడ్డ అయిన భిక్షపతి బీసీ నేతగా ఎదిగేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఆయన పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల కింద ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ మీటింగ్‌కు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చీఫ్ గెస్ట్ గా పిలిచి బీజేపీకి తమ సామాజికవర్గ బలాన్ని చెప్పకనే చెప్పారు. మరో వైపు తమ సామాజికవర్గం అయిన బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌తో కూడా భిక్షపతికి మంచి సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా సైనికుడిగా దేశసేవలో పాల్గొన్న భిక్షపతి ఎమ్మెల్యేగా చట్టసభల్లో వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పాలకుర్తి లాడాయికి ‘లకావత్..’
డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్.. ఈయన సొంతూరు పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదారం. జనగామలో ప్రముఖ డాక్టర్‌గా సేవలందిస్తున్న ఈయన రాజకీయాలకు పాత లీడరే.. లక్ష్మీనారాయణనాయక్ సతీమణి లకావత్ ధన్వంతి కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్‌లో ఎన్నోళ్లుగా క్రీయశీలకంగా పనిచేస్తున్న తనకు ఈసారి పాలకుర్తి టికెట్ ఇవ్వాలని హైకమాండ్‌ను కోరినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జంగా రాఘవరెడ్డి చాలా రోజులు పాలకుర్తిని పట్టించుకోలేదు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. కొన్ని రోజుల కింద ఆయన హనుమకొండ రాజకీయాల్లో వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఏళ్లుగా ఇక్కడ ఉండి పనిచేస్తున్న లక్ష్మీనారాయణ నాయక్ ప్రస్తుతం పాలకుర్తిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే పాలకుర్తిలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై బలమైన నేత పెట్టేందుకు అన్ని పార్టీలు చూస్తున్నాయి. అయితే బలం అంటే కేవలం డబ్బు ఖర్చు పెట్టేవారు కాదని.. స్థానికంగా ఉండి అందరికీ అందుబాటులో ఉండే లీడర్, ప్రజా సమస్యలు, పాలనపై అవగాహన ఉన్నవారు అయితే బాగుంటుందని పార్టీ కార్యకర్తులు అంటుండడం విశేషం.
పట్టు పెంచుకుంటున్న ‘సుల్తాన్..’
డాక్టర్ ఏ.ఆర్ సుల్తాన్ రాజ్.. టిప్పు సుల్తాన్ వారసుడైన ఈయన జనగామ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఆ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్న ఈయన పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు ఎప్పుడూ ఏదో విధంగా ఇతోదికంగా సాయం చేస్తూనే ఉంటారు. ఇక జనగామ పట్టణ సుందరీకరణ కోసం రూ.15 లక్షల విరాళం అందజేశారు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఈయన అన్ని వర్గాలతో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకుని బల నిరూపనకు ప్రయత్నించడం స్థానికంగా చర్చకు దారి తీసింది. సూల్తాన్ రాజ్ కూడా జనగామ రాజకీయాల్లో కీలకం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏదీ ఏమైనా డాక్టర్‌గా వైద్యసేవలు అందిస్తూనే.. సమాజ సేవ కోసం రాజకీయాల్లో వస్తున్న ఈ డాక్టర్ సాబ్‌లు.. కంపు రాజకీయాలను కడిగేస్తారా..! లేక వారు అందులోనే మునిపోతారా..! వేచిచూడాల్సిందే.. మరి..!
– ఉప్పలంచి నరేందర్, సీనియర్ జర్నలిస్ట్
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన