the-aim-of-the-center : పేదరిక నిర్మూలనే మా లక్ష్యం

https://chourasta.com/the-aim-of-the-c…radicate-poverty/ ‎
  • క్షేత్ర స్థాయిలో పథకాలు చేరవేసేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
  • కేంద్ర మంత్రి ఆర్‌‌.కె సింగ్

జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌‌ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం జనగామ జిల్లాలోని పెంబర్తిలో జరిగిన వీబీఎస్‌వై కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛంతో ఆహ్వానం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఆర్‌‌.కె సింగ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలకు ఇప్పటి వరకు 3 కోట్ల ఇళ్లను నిర్మించిందని వివరించారు.



అర్హులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్స పొందే వారికి రూ.5 లక్షల వరకు చెల్లిస్తోందని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచి నీటిని అందిస్తోందని, 2.36 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్టు వివరించారు. పీఎం ముద్ర యోజన పథకం కింద ఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించే లక్ష్యంగా రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. పీఎం స్వనిధి యోజన కింద చిరువ్యాపారులు, స్టాండ్ అప్ ఇండియా కింద ప్రతి మహిళకు రుణాలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.



పదేళ్లలో 24 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించామని తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందని, రానున్న కాలంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు రూ.3 కోట్ల రుణాల చెక్కును అందించారు. అలాగే మహాలక్ష్మి అండ్ దివ్య జ్యోతి సమాఖ్య కింద రూ.2.50 కోట్ల చెక్కును అందించారు. ముద్ర లోన్ కింద రూ.40 లక్షల చెక్కును లబ్ధిదారునికి అందించారు.

ఉజ్జ్వల పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్లను అందించారు. అదే విధంగా అందరిచేత వికసిత్‌ భారత్ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వరంగల్ నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో మై భారత్ రిజిస్ట్రేషన్లను చేపట్టారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించిన క్యాలెండర్లను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మర్ పింకేశ్ కుమార్, జిల్లా ప్రభరి ఆర్కే జీనా, యూబీఐ డీజీఎం సత్యనారాయణ, యూబీఐ ఏజీఎం ఎన్.శ్రీనివాస్, బీఆర్.నాయుడు, యూబీఐ జనగామ సీఎం చంద్రశేఖర్, కేంద్ర సమాచార అధికారి శ్రీధర్ సూరునేని, ఎన్‌వైకే అధికారి అన్వేష్ చింతల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌‌ ఆరుట్ల దశమంతరెడ్డి, సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఎంపీటీసీ రవి, జడ్ దీపికారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, డీసీఎస్‌వో రోజారాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...