kcr : సార్‌‌.. మీరు మారిపోయారు..

kcr

kcr

kcr : సార్‌‌.. మీరు మారిపోయారు..

‘సార్‌‌.. మారిపోయారు..’ అవును.. మీరు చదివింది నిజమే. విన్నదీ నిజమే. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం విన్నవారందరూ ఇదే విధంగా ఆశ్చర్యపోయారు. కేసీఆర్‌ అంటేనే ఓ సంచలనం.. ఆయన ప్రసంగం అంటే చాలు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ప్రాస.. యాస.. పడికట్టు పదాలు.. సామెతలు.. విసుర్లు.. విశ్లేషణలు.. వివరణలు.. ఉద్వేగం.. ఉత్తేజం నింపేలా ప్రసంగించడంలో (kcr)ఆయనకు ఆయనే సాటి.

స్వపక్షమా.. విపక్షమా అనే తేడా లేకుండా నాయకులంతా ఎదురు చూసేలా.. ఆకట్టుకునేలా ప్రసంగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పామరుడి నుంచి పండితుడి వరకు.. పిల్లల నుంచి పెద్దల వరకు.. హిందీ.. ఇంగ్లీషు.. ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడడంలో నేర్పరి.

మాటలతో ఉద్యమాన్ని నడిపి..

అంతెందుకు ఆయన మాటల గారడీ ఉద్యమాన్ని ఉరకలెత్తించిందనడంలో సందేహం లేదు. అతిశయోక్తి అసలే కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘మోసపోయింది చాలు.. గోస పడ్డది చాలు.’.., ‘దగాపడ‍్డది చాలు.. బలిదానాలు చాలు..’ అంటూ తన ఆవేదనను అందరికీ అర్థమయ్యేలా వివరించడంలో విజయం సాధించారు.

మచ్చుకు కొన్ని కేసీఆర్‌ పంచ్‌లు..

  • ఊరు భాషల మాట్లాడుతా.. ఉన్నది మాట్లాడుతా..
  • ఏ ఆగవయా.. లొల్లి పాడుగాను..
  • పొద్దన్న గూకలే గిప్పుడే జెడిపోయినవ నువ్వు
  • జెరాగు నేను మొత్తుకోవడితి.. నువ్వు మొత్తుకోవడితివి..
  • అప్పుడు నువ్వు బాగా మాట్లాడినవ్‌.. ఇప్పుడు మాట్లాడుతలేవని లొలి‍్ల వెడుతుండు
  • కన్నతల్లికి అన్నం పెట్టనోడు..పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన‍్నడట..
  • గిదే ఆగం.. ఇట్ల కొంత ఆగం..
  • ఇప్పుడేమంటున్నవ్‌ మరి.. ఉండవయా బాబు..
  • గిదేనా తెలివికల్ల ముచ్చట..
  • మోపైనారు.. ఆడొకడు.. ఆడొకడు..
  • జోగడు.. బాగడు..జోకెటోడు..
  • ఏం జరుగుతంది కథా..
  • ఇలా చెప్పుకుంటే పోతే ముచ్చట వొడువది.

‘బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా..?’ అంటూ తన ఆహార్యంపై జోకులు పేల్చగలరు. ఆయనపై ఆయనే జోకులు వేసుకోవడం.. పిట్టకథలు చెప్పడం.. సభలో నుంచి ఏ ఒక్కరూ బయటకు వెళ్లకుండా.. లక్షలాది మంది మంత్రముగ్ధులయ్యేలా ప్రసంగించడం ఆయనకే సాధ్యం. కానీ నిన్నటి సభలో అది కనిపించలేదు.

నాటి కేసీఆర్‌‌ వేరు..

ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ వేరు.. ఇప్పటి కేసీఆర్‌ వేరు. ఉద్యమ సమయంలో ఆవేదనను వెళ్లగక్కేలా.. అందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా.. తెలంగాణ బాధ అందరికీ అర్థమయ్యేలా.. వివరించడానికి ఆయన ఎంచుకున్న దారి ‘మాట’.. అది తూటాలా దూసుకెళ్లింది. లక్ష్యం వైపు ఉద్యమాన్ని నడపడంలో విజయం సాధించారు. కల సాకారమైంది.

kcr

చెప్పిందే చేస్తున్నరు..

తెలంగాణ ఏర్పడిన సమయంలో కేసీఆర్‌ ఓ మాట చెప్పారు ‘ఇన్నాళ్లూ ఉద్యమ పార్టీ.. ఇక ఇప్పటి నుంచి రాజకీయ పార్టీ.. ఫక్తు రాజకీయ పార్టీ.. అట్లనే వ్యవహరిస్తం.. అట్లనే మాట్లాడుతం..’.. ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారు.. మాట్లాడుతున్నారు.

పంథాను మార్చుకుని..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతాం అన్న కేసీఆర్‌.. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు తన పంథాను మార్చుకున్నారు. అవసరం కూడా. ఓ ముఖ్యమంత్రిగా ఉంటూ ఉద్యమ సమయంలో మాట్లాడినట్లు మాట్లాడలేరు. మాట్లాడరు కూడా. కానీ ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది చెబుతున్నారు. అందులో మాత్రం మార్పేమీ లేదు.

ఏదేమైనా కేసీఆర్‌ ప్రసంగం మత్తెక్కించే ఓ టానిక్‌. ఆ జోష్‌ ఆశించే వారికి ఎల్బీ స్టేడియం మీటింగ్‌ కొంత నిరాశే మిగిల్చింది.

– సాత్విక నక్షత్ర, మన చౌరాస్తా

యూసుఫ్‌గూడ పటేల్‌ ఎత్తి పడేసిన కేటీఆర్

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *