Urapichuka : ఊరవిశ్క..

Urapichuka : ఊరవిశ్క..

‘మన తెలంగాణ భాష యాసలో నేనో పుస్తకం రాయాలనుకున్నా. ఊరికే భాష కోసం ఏదో ఒకటి రాస్తే విశేషమేముంది? అందుకే నాటి తీపి గుర్తులను వర్తమాన పరిస్థితులతో పోలుస్తూ ఈ పుస్తకం రాశా.. నిజానికివి కథలు కావు. నా ఊరు, నావాళ్లు నాకిచ్చిన అనుభవాలు..’ అంటూ సీనియర్ జర్నలిస్టు చిల్ల మల్లేశం గారు రాసిన ‘జెకముక సంచి’ తెలంగాణ పల్లె కథలు పుస్తకం చదువుతున్నంత సేపు నాకు నా చిన్ననాటి గుర్తులు ఎన్నో కళ్లముందు తిరిగాయి. ఆ అనుభూతి మీకు కలుగుతుందని భావిస్తూ.. మన ‘చౌరాస్తా’లోకి తెస్తున్నా.. ఈ పుస్తకంలో 22 కథలు ఉన్నాయి.. ఇందులో ప్రతీ కథ సార్‌‌నాటి అనుభవమే.. మొదటగా ‘ఊరవిశ్క’ ముచ్చటేందో సూద్దాం.. పా..

ఊరవిశ్క.. (Urapichuka)

తెప్పన తెల్లారింది. దబ్బున లేశిన. కళ్లు పొడుసుక సూత్తె ఎదురుంగ చెల్లె. ఎంటికలు ఇరవోస్కొని ఒకటే ఏడుపు. ‘ఏందె..?’ ‘ఆ.. ఆ.. ఆ.., ఈ.. ఈ..ఈ.., ఏ.. ఏ.. ఏ..’ ‘చెల్లె ఏందె’ ‘ ఊ.. ఊ.. ఊ..’ ఒకటే దీర్ఘం దీత్తంది.! ‘డబల్‌ రొట్టెల.. డబల్‌ రెట్టె..!  రోజిదేపని..! ఏడికివోవాలె పైసలకు..! మీ అయ్యేమన్న నౌకరిగాడా..?’ ఆకిట్ల అవ్వ గునిపిత్తంది. ‘ఇటు రాయె..’ చెల్లె పిలిశిన. కండ్లు తుడుసుకుంట దగ్గరికచ్చింది. ఏడుపాపి ఎగపోత్తంది. ‘ఆయైందా.. ఏడ..?’ అనడిగిన. నెత్తి మీద అవ్యేడగొట్టిందో సూయించింది. మాడ మీద శెయ్యేసి నిమిరిన. ఎగపోత కొంచి తగ్గింది. అవ్వ లోపలికచ్చింది. ‘బొండిగెవిస్కుత బిడ్డ మళ్లోసారేడ్తె..!’ అని గద్దరిచ్చెవరకు మళ్ల ఏడుపు మొఖం పెట్టింది. నేను ‘ఉకో.. ఊకో..’ అనంగనే అండ్లదండ్ల మింగింది. సాట్ల బియ్యం బోస్కొని అవ్వ పోయింది.

చెల్లె ముఖం సాటంతైంది.

బయట బియ్యం జెరిగిన సప్పడైతాంది. ‘కిస్‌.. కిస్‌.. కిస్‌..!’ ‘ఊరవిశ్కలు (Urapichuka)(వచ్చినట్టున్నయ్‌’.. అనన్న.. చెల్లె ముఖం సాటంతైంది. లగాంచి బయటికుర్కింది. ఎన్కనే నేను పోయిన. చెల్లె పడతవొయ్యే వరకు పిట్టల్లేశి పేయినయ్‌..’  అవ్వ బియ్యం జెరిగి సాటాడవెట్టి ఎటో పోయింది. నేను మెల్లగ లోపలికి పోయిన. అటీటుజూసి గిన్నన్ని బియ్యం బట్కొని బయటికచ్చిన. నా శేతుల బియ్యం జూశి, చెల్లె కండ్లింతైనై. ‘కట్టె దోపోయే చెల్లె..’ అనంగనే పెంట మొఖాన పోయింది. కట్టె పొడుగుద్దెత్తె సగానికి ఇరిశినం. సాటను నిలవెట్టి కట్టానువెట్టినం. సాట లోపలికెళ్లి  ముందటిదాక బియ్యం జల్లి ఎనుక గూసున్నం. ఇంటి సూర్ల దిక్కు సూత్తన్నం. శెవులటుపెట్టి సప్పుడింటన్నం. ‘కిస్‌.. కిస్‌.. కిస్‌’ గప్పడిదిగప్పుడె సూర్లకెలి రెండు పిట్టలచ్చినయ్‌.. బియ్యం బుక్కుడు షురు జేశినయ్. ఓటి బుక్కుకుంట బుక్కుకుంట సాట్లదాకచ్చింది. నేను సప్పుడు జెయ్యక జెప్పన కట్టె గుంజిన! సాటవొయ్యి పిట్ట మీద వడ్డది. దాన్ని మెల్లగ లేపి పిట్టను దొర్కపట్టిన! హిహ్హిహ్హి..  చెల్లె పండ్లిగిలిచ్చింది. ‘ఎయ్..ఎయ్’ అనుకుంట ఇంతెత్తెగురుతుంది. ‘అన్న.. అబ్బ.. అబ్బ.. నాకియ్యె.. అబ్బ.. అబ్బ..! మీద కలవడ్తంది. ‘నాకేందిపో’ అనంగనె ఏడుపుముఖం పెట్టింది. ‘ఏడ్వకు అని గద్దరిచ్చిన! అది రెండు జేతుల పిట్టను వట్టుకుని ఇగ మురుత్తాంది.! దాని మూతిని రెండు, మూడుసార్ల ముద్దిచ్చుకన్నది.

నిజంగా రూపాయే..!

గంతల్నె అవ్వచ్చింది. చెల్లె శేతిల పిట్ట దాని కంట్లెవడ్డది. ‘ఊరవిశ్కనా ఏందె..?’ అనంగనే దూరముర్కింది. ‘ ఓ పోరీ.. సప్నీ.. ఇటు రాయే.. సత్తదే..!’ అంటూ అవ్వ ఒర్రుతంది. ‘ఊ.. నాకేంది..!’ ఇడిశిపెట్టనన్నట్టు చెల్లె తల్కాయెనోసారి పక్కకంచి, సక్కగ జేసింది. ఏమైందోగని గప్పటిదాక కోపంతోనున్న అవ్వ ఒక్కసారి సల్లవడ్డది. ‘సప్నీ.. బాంచెనె.. బాంచెనె.. ఇడిశిపెట్టె.. గోసదల్గుతదె.. నీకు పిల్లలుపుట్టరె..!’ అనుకుంట చెల్లెను బుదురకిచ్చుడు వెట్టింది. ‘నీకు అప్పడికి అయిస్క్రేటు గోనిత్తనె..!’ అంటూ ఆశ పెట్టింది. ‘.. ఆ.. నువ్వుగొడ్తావ్‌.. కొనియ్యవ్‌..’ అని చెల్లె గావురమాడింది. ‘నిజంగిత్తనె..’ అని బొడ్లెసంచిల శెయ్యివెట్టి.. ‘మయీ.. ఇగొ రూపాయి.. దానికియ్యి. అప్పటికి శెరోటి కొనుక్కోర్రి.. పిట్టనిడిశిపెట్టుర్రి..’ అనుకుంట నా శేతిల పైస పెట్టింది.  నిజమే..! ఆటాణగాదు రూపాయే! ‘చెల్లె పైసనే.. రూపాయి.. రూపాయి.. ఇడిశిపెట్టు.. పిట్టనిడిశిపెట్టు..’ అనన్న రూపాయిచ్చిందన్న సంబ్రమో, అవ్యూకోదన్న భయమో ఆఖరికి చెల్లె పిట్టనిడిశిపెట్టింది! శేతులు గిట్లన్నదో లేదో గప్పడిదిగప్పుడె ఎగిరావలవడ్డది..!

(శిన్న బతుకమ్మ.. సిన్నబోయింది)

(మరిన్ని కథనాల కోసం క్లిక్‌ చేయండి)

(చౌరాస్తా పేజీ కోసం..)

పైసంటె పాణంబొయ్యే మా అవ్వ పిట్ట కోసం రూపాయెందుకిచ్చిందో నాకప్పడు సమజ్‌ గాలె.! సెల్‌ఫోన్లతోటి గిప్పుడు పిట్టలే లేకుంట పోతాంటె తెల్తంది! గప్పటి మనుషులు ప్రకృతి ప్రతిరూపాలని! తమ పిల్లల్లెక్కనే శెట్టును, పుట్టను, పిట్టను, గొడ్డూగోదను  పాణమోలె జూస్కున్నరని! నడిత్తార్ల దిని, కొసిత్తార్ల ఏరిగే గిప్పటి మనుషుల రీతిని తలుసుకుంటాంటె నా పర్సనల్‌ సెల్‌ఫోన్‌ రెండోసారి మోగింది..!

– చిల్ల మల్లేశం, సీనియర్ జర్నలిస్టు

You may also like...

2 Responses

  1. Aazaad says:

    పద బంధాల అల్లికలు, వాక్య నిర్మాణాల వరుసలు అద్భుతం. తెలంగాణ పల్లె జీవితాన్ని , సహజమైన జీవన శైలిని తన కథల్లో, పదాల్లో, వాక్యాల్లో కూర్చడం రచయిత సృజనాత్మక ప్రక్రియ ఎంత గొప్పదో అర్ధం అవుతోంది. పూసే పువ్వులు, వీచే గాలి, పారే సెలయేరు ఎంత సహజమైన గుణాన్ని కలిగి ఉంటాయో, ఎంతటి మధురమైన అనుభూతిని కలిగిస్తాయో.. ఈ ఊర విష్క చదువుతుంటే అలాంటి స్పందనే కలుగుతోంది. కొన్ని రకాల చందో బద్దమైన కవిత్వ పైత్యాలకంటే, సహజత్వం కలిగిన ఇలాంటి రచనలు, రచయితలు కావాలి మనకు.
    ????
    నేను
    ఎండి. జావిద్ పాషా
    (ఆజాద్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *