salary : జీతం కోసం చేరితే..

సాక్షిలో నేను సబ్‌ ఎడిటర్‌‌గా పనిచేస్తున్న సందర్భం.. డెస్క్‌లోకి వెళ్లగానే అందరినీ విష్‌ చేయడం నాకు అలవాటు.. కానీ ఆయనను ఎలా మందలించాలో అర్థం కాదు.. అసలే ఫస్ట్‌ పేజీ చూసే సారు.. మాట్లాడకుంటే ఎలా అని.. దగ్గరకు వెళ్లి ‘సార్‌‌.. నమస్తే..’ అంటే ‘ఏమయా పేరుపెట్టి పిలుస్తున్నావ్..’ అంటూ చిలిపిగా చమత్కరించే వారు.. ఆయన పేరులాగే ఆయన పెట్టే శీర్షకలూ ప్రత్యేకంగా ఉంటాయి. అవే ఆయన ఐడెంటిటీ కూడా.. 2006లో జీతం కోసం డెస్క్‌ జర్నలిస్టుగా మారిన ఆయనకు ఆ తర్వాత అదే జీవితం అయ్యింది.. అదే ‘దునియా’లో ఇంకా బతుకుతున్నాడు. నా కొత్తదారిలో పాత మిత్రుల కోసం వెతుకుతున్న తరుణంలో ఆయనకు మరోసారి ‘నమస్తే’ చెప్పాలని పించింది. నా పలకరింపుతో గతంలో వెళ్లిన ‘గడుదాసు నమస్తే’ తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.. (ఆయన మాటల్లోనే…) 

2006లో వార్తతో ఈ ఫీల్డ్‌కు వచ్చా..

నేను చదివింది డిగ్రీ. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. సబ్జెక్ట్ మీద పట్టు లేదు. ఆ పరిస్థితుల్లో పైచదువు అబ్బవని అర్థమైపోయిందికానీ తెలుగు భాషపై మక్కువ ఎక్కువబతుకుదెరువు కోసం ఒక ఉద్యోగం కావాలి. కొంతకాలం ఎస్టీడీ బూత్‌లో పనిచేశా. నెలకు రూ.600. ఆ ఉద్యోగంతో బతకడం కష్టం. ఆ సందర్భంలోనే ఉద్యోగ ప్రకటన కోసం రోజూ పేపర్ చదివేవాడిని. ఒక రోజు వార్త దినపత్రికలో సబ్ఎడిటర్లు కావాలనే ప్రకటన చూశా. 2006లో అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులపై వ్యాసం రాయమన్నారు. రాశా. ఫలితం కోసం చాలా రోజులు ఎదురు చూశా. ఎంతకీ సమాచారం అందకపోవడంతో హైదరాబాద్ ఆఫీసుకు ఫోన్ చేశా. అప్పుడు చెప్పారు వారు.. రాత పరీక్ష వరంగల్ యూనిట్లో పరీక్ష రాయమని

ఆఫీస్ ముందు నుంచే..

మా సొంతూరు వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావికానీ పదో తరగతి తర్వాత నా జీవితం మొత్తం వరంగల్లోనే గడిపా. అలా ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా వార్త ఆఫీసు ఉందని తెలుసు. అప్పుడప్పుడు సెకండ్ షో సినిమాకు ఆ ఆఫీసు ముందు నుంచే వెళ్లేవాన్ని. ఆఫీసులో ప్రింటింగ్ సౌండ్ వినిపించేది. ముందర జీపు, ఆటోలు ఉండేవి. అందులో పనిచేయాంటే ఏం చదువుకోవాలో అని అనుకునేవాడిని. అలాంటిది ఆ ఆఫీసులో పరీక్ష రాయడం కొంచె కంగారుగా అనిపించింది. రాత పరీక్ష అయిపోయింది. మళ్లీ ఇంటర్వ్యూకి కూడా ఫోన్ చేస్తేనే సమాచారం తెలిసింది

ఈ సారి హైదరాబాద్. మెయిన్ ఆఫీసులో ఇంటర్వ్యూ అంటే కొంత భయమేసింది. అప్పటికే ఇంట్లో వాళ్లు నా మీద రూపాయి ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టంగా లేరు. ఆయినా.. ఇంటర్వ్యూ అని చెప్పి రూ.2,500 పట్టించా.. (నవ్వుతూ).. వాటితో రెండు జతల బట్టలు కొనుక్కున్నా. చేతి ఖర్చుకు కొన్ని డబ్బులు అట్టిపెట్టుకున్న. హైదరాబాద్ వెళ్లా. ఆ రోజు జరగాల్సిన ఇంటర్వ్యూ సీఎండీ గిరీశ్ సంఫీు గారు లేకపోవడం వల్ల మరుసటి రోజుకు వాయిదాపడింది. ఆ రాత్రి అక్కడే స్నేహితుడి రూమ్‌లో ఉన్నా. మరునాడు అదే పరిస్థితి. ఉదయం వెళితే.. మధ్యాహ్నం అన్నారు. చివరకు సాయంత్రం వరకు కూడా సీఎండీ గారు అందుబాటులో లేకపోవడంతో ఎడిటర్‌‌తో ఇంటర్వ్యూ ముగించారు.

పుష్‌పుల్‌ టూ పుష్‌పుల్..

ఇంటర్వ్యూ ముగిసిన తెల్లారి నుంచే శిక్షణ తరగతులు. ఒక రోజంటే స్నేహితుడి రూంలో ఉన్నా. ఆరునెలల పాటు అంటే కష్టమని తేలిపోయింది. అందుకే వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నా. వరంగల్ నుంచి ఉదయం 4.30 గంటలకు పుష్ పుల్ ట్రైన్‌లో హైదరాబాద్ కు వెళ్లి.. రాత్రి ఏడింటికి అదే ట్రైన్‌ ఎక్కి వరంగల్‌కు చేరుకునేవాణ్ని. రాత్రి పదకొండు అయ్యేది. అలా ఒక నెల తర్వాత జర్నలిజం బ్యాచ్ మెట్ల రూంలో చేరిపోయా

శిక్షణలో ఇలా..

కాశీవిశ్వేశ్వర్ గారు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్. చాలా డిఫరెంట్‌గా ఉండేవారు. ఏ పని దొరకక ఈ వృత్తిని ఎన్నుకున్నారని మొదటి రోజే మా ముఖాలు చూసి చెప్పారు. ఎందుకంటే పీజీ చేసిన వారు కూడా మా బ్యాచ్‌లో ఉన్నారు(నవ్వుతూ).. ఉదయం పదింటికల్లా క్లాసుకు అటెండ్ కావాలి. అన్ని పేపర్లు చదవాలి. ముఖ్యమైన వార్తలు నోట్ చేసుకోవాలి. పేపర్లో వచ్చిన శీర్షికలు మార్చి మళ్లీ పెట్టాలి. మధ్యాహ్నం లంచ్ తర్వాత సీనియర్ జర్నలిస్టుతో క్లాసు ఇప్పించే వారు. వారి అనుభవాలే మాకు పాఠాలు. ప్రతీ ఆదివారం ఏదో ఒక అసైన్మెంట్ ఇచ్చేవారు. నేను గోల్కొండ కోట, జూలాజికల్ పార్కు, మ్యూజియం సందర్శించి ఐటెమ్ ప్రజెంట్ చేశా. ఒక నెల తర్వాత కంప్యూటర్ ఇచ్చారు. తెలుగు టైపింగ్, పేజినేషన్ నేర్పించారు. మూడు నెలల తర్వాత డెస్క్ కు అటాచ్ చేశారు. మొత్తానికి ఆరు నెలల శిక్షణ కాలం ముగిసింది. ఎట్టకేలకు సీఎండీ గారి అపాయింట్మెంట్ దొరకడం.. మాకు పోస్టింగ్ ఇవ్వడం అయిపోయాయి. నా మొదటి జీతం రూ.5 వేలు.

కరీంనగర్‌‌లో మొదటి డ్యూటీ..

నన్ను కరీంనగర్ పంపించారు. వరంగల్ నుంచి నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్న హింగె మాధవరావు (ప్రస్తుతం వెలుగు జనగామ స్టాఫ్ రిపోర్టర్), గొడిశాల రమేశ్ బాబు (ఆంధ్రజ్యోతి నిజామాబాద్ ఎడిషన్ ఇంచార్జి) ఇద్దరికీ రిపోర్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన రెండో రోజు కరీంనగర్ యూనిట్‌కు వెళ్లా. అప్పటికే మా సీనియర్ బ్యాచ్ కు చెందిన రాంప్రసాద్ అనే సబ్ ఎడిటర్ కరీంనగర్‌‌లోనే పనిచేస్తున్నాడు. అతడిని కాంటాక్ట్ అయి.. అతడి రూంలోనే దిగా. ఆ రూంలో అతడితో పాటు ఎడిషన్ ఇంచార్జి, సెకండ్ ఇంచార్జి ఉండే వారు. రెండు రోజులు భయం అనిపించినా తర్వాత అలవాటైపోయింది

మూడు నెలల పోరాటం తర్వాత ఓరుగల్లుకు.. 

ఫస్ట్ మూడు రోజులు అబ్జర్వేషన్ చేయమన్నారు. నాలుగో రోజు ఓ సబ్ ఎడిటర్ అచానక్ గా లీవ్ పెట్టాడు. అతడు పెట్టే పేజీల్లో క్రైం పేజీని నాకిచ్చారు. నెల రోజుల తర్వాత జోన్ అప్పజెప్పారు. అప్పటి వరకు అక్కడున్న ఎడిషన్ ఇంచార్జి బదిలీ అయ్యారు. కొత్త ఇంచార్జిగా శ్రీనివాస్ రావు గారు వచ్చారు. నేను కరీంనగర్‌‌ వెళ్లి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఇక వరంగల్‌కు పంపించాలని చిన్నగా మొరపెట్టుకున్నా. మూడు నెలల పోరాటం తర్వాత వరంగల్‌కు బదిలీ అయ్యాను.

శీర్షికల్లో ఆయనే దిట్ట..

2007 చివరలో వరంగల్ యూనిట్ కు వచ్చా. అప్పుడు శెంకేసి శంకర్‌‌రావు గారు ఎడిషన్ ఇంచార్జి. ఎక్కడ చేసినా అదే పని కానీ, వరంగల్‌లో డిజైనర్లు పేజీ పెట్టేవారు. అది కాస్త కలిసొచ్చింది. ఎడిటింగ్‌కు అవకాశం దొరికింది. శంకర్‌‌రావు గారి దగ్గర శీర్షిక పెట్టే విధానం గురించి నేర్చుకున్నా. శీర్షిక పెట్టే విషయంలో ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనే నాకు స్ఫూర్తి. ఆఫీస్‌ లో అందరితో సరదాగా ఉండేవాడ్ని. సీనియర్ డిజైనర్ గొలనకొండ శ్రీనివాస్, కామిశెట్టి రాజు చాలా దగ్గరగా ఉండేవాళ్లు. కామిశెట్టి రోజూ రెండు టిఫిన్ బాక్సులు తెచ్చేవాడు. ఒకటి ఆయనకు. రెండోది నాకు.

salary : జీతం కోసం చేరితే..

అనుకున్నట్లే అవకాశం..

2008లో సాక్షి దినపత్రిక అనౌన్స్ అయింది. మా డెస్క్ లో ఉన్న సీనియర్ డిజైనర్ గొలనకొండ శ్రీనివాస్ (వాసు) అందులో చేరాడు. ఆ తర్వాత ఎంతమంది పోతారోనని రోజూ ప్రచారం జరిగేది. నన్ను కూడా బయోడేటా ఇవ్వమని కొందరు చెప్పారు. కానీ, అవకాశం దానంతటే అదే రావాలని అనుకున్న. సాక్షి డమ్మీ కొడుతున్న సమయంలో నాకు అవకాశం వచ్చింది

కేకే గారు చాలా స్ట్రిక్ట్..

సాక్షి ప్రారంభంలో వరంగల్ ఎడిషన్ ఇంచార్జి కెంచ కుమారస్వామి (కెకెగారు. సార్ పేరు కరీంనగర్‌‌లో విన్నా. చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు. రిపోర్టర్ ఎడిషన్ కు రాలవాంటేనే భయపడేవారట. ఒక రోజు ఆయన నుంచే నాకు ఫోన్ వచ్చింది. లైఫ్ బాగుంటుంది రమ్మని చెప్పారు. సరే అన్నాను. రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి మరునాడు హైదరాబాద్ వెళ్లమని చెప్పారు. మరునాడు సాయంత్రం ఐదింటికి ఆఫీస్ కు వెళ్లాను. అప్పుడు చైర్మన్ వై.ఎస్ జగన్ గారు ఆ సమయంలో ఆఫీసులో ఉన్నారట. లోపలికి ఎవరినీ పోనివ్వడం లేదు. కాసేపు బయటే నిలుచున్న. కొంతసేపటికి కరీంనగర్ వార్తలో ఎడిషన్ ఇంచార్జిగా పనిచేసిన శ్రీనివాస్ సార్‌‌ బయటకు వచ్చారు. ఆ సార్‌‌ను కలిశా. వరంగల్ నుంచి కేకే గారు పంపించారని చెప్పా. టీ తాగాక ఆయనతో పాటు నన్ను కూడా లోపలికి తీసుకెళ్లారు. అప్పటికే ఎడిటర్ పతంజలిగారి క్యాబిన్‌లో ఎవరో ఉన్నారు. ఆయన వెళ్లిపోయాక శ్రీనివాస్ గారు లోపలికి తీసుకెళ్లి.. సార్ కు పరిచయం చేశారు. తన స్టూడెంటే అని చెప్పారు. ఒక ప్రశ్న అడగకుండానే మరునాడు జాయిన్ కమ్మన్నారు.  

మనసాక్షితో పనిచేశా..

ఆ మరునాడు సాక్షి వరంగల్ యూనిట్‌కు వెళ్లా. డ్యూటీలో చేరిపోయా. అప్పుడు డెస్క్ లో నాకు తెలిసింది గొలనకొండ శ్రీనివాస్, సీనియర్ సబ్ఎడిటర్, సెకండ్ ఇంచార్జి శేషగిరిరావు గారు మాత్రమే. మిగతా వారంతా కొత్త. వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్. రెండు మూడు రోజులు గడిచింది. నాలుగో రోజు ఏటూరునాగారం జోన్ ఇచ్చారు. ఫస్ట్ పేజీ ఎడిటింగ్ వినయ్ అనే సబ్ ఎడిటర్ చూసేది. కొంతకాలానికి అతడు మానేశాడు. ఆ తర్వాత కేకే గారు.. ఒక రోజు ఫస్ట్ పేజీ ఐటెమ్ ఇచ్చి చేయమన్నారు. శీర్షిక హైలెట్ అయ్యింది. మరునాడు రివ్యూలో వచ్చింది. నాకు కొంత.. కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. అలా అలా ఫస్ట్ పేజీ బాధ్యతలు పూర్తిగా అప్పగించారు. నాకు అప్పగించిన పని బాధ్యతగా చేసేవాడిని. ఆ విషయంలో కేకే గారితో ఎప్పుడూ నాకు విభేదాలు లేవు. ఒక రోజు మాత్రం కేకేగారు సీరియస్ అయ్యారు. మెయిన్ పేజీలో వార్త మార్చే క్రమంలో ఎడిషన్ పది నిమిషాలు లేట్ అయ్యింది. మరుసటి రోజు ఉదయాన్నే ఎనిమిదింటికి ఫోన్ చేసి మందలించారు. అదే మొదటిదీ.. చివరిది కూడా.. 

పూర్తి స్వేచ్ఛ నిచ్చారు..

కొంతకాలానికి కేకే గారు ఖమ్మం బదిలీ అయ్యారు. ఆ స్థానంలో తాటి జాన్ రెడ్డి గారు వచ్చారు. ఆ సమయంలో కొంత సడలింపులు చేశారు. డోర్నకల్, భూపాపల్లి జోన్ అప్పగించారు. ఫస్ట్ పేజీని నాకంటే సీనియర్ సబ్ఎడిటర్ ముజాహిద్ గారికి అప్పగించారు. కొంతకాలానికి ముజాహిద్ బదిలీ కావడంతో తిరిగి ఫస్ట్ పేజీ నా చేతికొచ్చింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం రాజుకుంటోంది. తెలంగాణ యాస, భాష మీద చర్చ సాగుతోంది. దాంతో వాడుక భాషలో శీర్షికలు పెట్టే ప్రయత్నం మొదలు పెట్టా. జాన్ రెడ్డి గారు కూడా ప్రోత్సహించారు. డెస్క్ లో కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వాస్తవంగా నాకు పాన్లు తినే అలావాటుంది. ఆఫీసుకు వచ్చేటప్పుడే నాలుగైదు తెచ్చుకునేవాన్ని. శీర్షిక గురించి ఆలోచించే సమయంలో కచ్చితంగా పాన్ తినేవాన్ని. ఆ అవకాశం కూడా జాన్ రెడ్డి గారు నాకు ఒక్కడికే ఇచ్చినట్లుగా అనిపించేది

  • ఒకసారి ఓ ఐటెంకు రేపటి కోసంఅని శీర్షిక పెట్టి.. ఎడిట్ చేస్తున్నా.. వెనుక నుంచి చూసిన ఎడిషన్ ఇంచార్జి జాన్ రెడ్డిగారు.. ‘నమస్తే ఆ ఐటెమ్ ఈ రోజుకే అబ్బా..’ అని అనడం.. నేను అదే హెడ్డింగ్‌ సార్‌‌ చెప్పడం నేను మరిచిపోలేను.
  •  నా పేజీకే కాదు, డెస్క్ లో ఎవరడిగినా శీర్షికను పెట్టేవాడిని. ఒకసారి ఖమ్మం ఎడిషన్‌కు కూడా శీర్షిక అందించా. పచ్చిమిర్చి కిలో వంద రూపాయలు ఉందంటే.. పచ్చిమిర్చీ ‘నూరుకొనలేంఅని పెట్టా
  • ఉద్యమ సమయంలో ఏపీపీఎస్సీ పరీక్షలు వరంగల్‌లో జరిగాయి. భారీ పోలీస్ బందోబస్తు పెట్టారు
  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ కమిషన్’ 

అని శీర్షిక పెట్టా. మరుసటి రోజు శీర్షిక తీవ్రంగా ఉందని మెమో ఇచ్చారు. అందుకు బాధ్యుడిగా ఎడిషన్ సెకండ్ ఇంచార్జి గోపాల బాలరాజు గారు (బాలన్న) ఒకరోజు సస్పెండ్ అయ్యారు (నవ్వుతూ చెప్పారు).. డెస్క్ లో ఉన్న ముజాహిదన్న (ఆంధ్రజ్యోతి, సీనియర్‌‌ సబ్​ ఎడిటర్), కిశోరన్న (సాక్షి స్టాఫ్​ రిపోర్టర్, మెదక్)తో  కూడా హెడ్డింగ్‌ల్లో పోటీ పడేవాన్ని.. ఇక నా ఐటెంలను డిజైనర్స్ వాసు (శ్రీనివాసు), రాజన్ బాబు (రాఘవులు), వనం శ్రీకాంత్ (చిన్నోడు) అందంగా తీర్చిదిద్దేది.

ఉన్నట్టుండి మలుపు..

అలా సవ్యంగా సాగిపోతున్న నా ఉద్యోగ జీవితం ఉన్నట్టుండి ములుపు తిరగడం ప్రారంభించిందిజాన్ రెడ్డి గారు బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి ముందు నుంచే ప్రమోషన్లు ఉంటాయని ప్రచారం సాగింది. కానీ, నాకు ఆ అవకాశం రాలేదు. చాలా డిప్రెషన్ కు లోనయ్యా. ఏం చేస్తాం.. కేవలం పనిమీదే ధ్యాస పెట్టిన నేను నాకంటూ ఒక గాడ్ ఫాదర్ లేకపోయేనని చాలా బాధపడ్డా. కానీ సార్ హయాంలో చాలా హ్యాపీగా పనిచేశా. ఆయన బదిలీ తర్వాత ఆ స్థానంలో జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చీరాగానే భూపాపల్లి, డోర్నకల్ జోన్ కు మారిపోయా. ఆ సమయంలోనే నాకు అనిపించింది నేను ఈ సార్ దగ్గర ఎక్కువ రోజు ఉండనని! అనుకున్నట్టుగానే కొంతకాలానికే బదిలీ ఉత్తర్వులు అందాయి

చాలా బాధేసింది..

2014 జనవరిలో ప్రసిద్ధిగాంచిన సమ్మక్క జాతర. జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు నాకు యాక్సిడెంట్ అయింది. కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కన్ను భాగంలో కూడా దెబ్బతగిలింది. ఆ మరుసటి రోజు రెండు నెలలు సెలవు కోరుతూ లెటర్ పంపించా. ఒక నెలకు మించి ఇవ్వడం కుదరదన్నారు. సరే అనుకున్న. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా. జాతరకు ఇంకా వారం ఉంది. ఓ రోజు ఫోన్‌ చేసి జాతర అయ్యేంత వరకు ఆఫీసుకు రమ్మన్నారు. కంటికి తగిలిన గాయం మానలేదు అని చెప్పా. ఏం పనిచేయొద్దు.. ఖాళీగా కూర్చో. శీర్షిక ఇస్తే చాలు అని చెప్పారు. అలా జాతర ముగిసే వరకు పనిచేశా. తర్వాత మళ్లీ సెలవు కంటిన్యూ చేశా. సెలవు పొడిగిస్తారనుకున్నా.. కానీ లేదు. సరిగ్గా మూడు నెలలు కాలేదు. ఊహించినట్టుగానే బదిలీ ఉత్తర్వులు రానే వచ్చాయి. ఎలాగోలా హైదరాబాద్ వెళ్లి.. ఏడ్చో తూడ్చో బదిలీని వాయిదా వేయించుకున్న. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. పూర్తిగా కోలుకోకముందే బదిలీ చేసిన తీరుపై అప్పట్లో చాలా బాధేసింది. కానీ ఏమంటాం.. ఏమనలే!

మళ్లీ ఆర్నెళ్లకు..!

కచ్చితంగా మళ్లీ ఆర్నెళ్లకు బదిలీ.. ఈసారి రాజమండ్రికి.. అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తొలగించడానికి చాలా మందిని బదిలీ చేశారు. కానీ నా బదిలీ వెనుక కచ్చితంగా ఆయన గారి హస్తం ఉందనిపించింది. అసలు ఎక్కడికి పోనని పట్టుబట్టా. ఆఫీసు ఎదుట ధర్నా చేశా. చైర్ పర్సన్ మేడమ్ గారికి, ఈడీ గారికి నా పరిస్థితి వివరిస్తూ లేఖ రాశా. స్పందన లేకపోయింది. దాదాపు మూడు నెలలు తిరిగినా ఫలితం లేదు. ఓ పక్క పిల్లలకు జ్వరం.. మరోపక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పటికే ఒక నెల వేతనం కూడా ఆపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేశాఅప్పుడనిపించింది.. ఎక్కడా కూడా నిజాయితీగా, నిక్కచ్చిగా, నిబద్ధతతో పనిచేయకూడదని. కేవలం పెద్దలను ప్రసన్నం చేసుకుంటే చాలని..

ఎన్నో గుణపాఠాలు..

రాజీనామా చేసిన అనంతరం రెండు నెలలు ఖాళీగానే ఉన్నా. ఆ తర్వాత వరంగల్లో కొత్తగా ప్రారంభమైన ఈవినింగ్ పేపర్లో చేరా. వేతనం ఆరు వేలు. కేవలం శీర్షిక కోసమే నన్ను తీసుకున్నారని తెలిసింది. నా పని మీద నాకు నమ్మకం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పత్రిక బంద్ చేశారు. ఒక నెల వేతనం (salary) కూడా ఎగ్గొట్టారు. ఆ తర్వాత మరో పేపర్.. అక్కడా అదే పరిస్థితి. రెండు, మూడేళ్లు చిన్నచిన్న పేపర్లలో చేశా. ఆ తర్వాత తెలియకుండా ఓ సుడిగుండంలో ఇరుక్కున్నా. మళ్లీ తిరిగి 2018లో సూర్య దినపత్రిక నుంచి మలి ఉద్యోగ జీవితం ప్రారంభించా. అక్కడ కూడా అదే పరిస్థితి. అరకొర వేతనం.. అందులో కోత. ఏదో వృత్తి మీద మమకారంతో జీవితాన్ని సాగిస్తూ వచ్చా. అదే సంవత్సరం నుంచి సాక్షిలో మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టా. నేరుగా వైఎస్ జగన్ సార్ ను కలవాలని ప్రయత్నం చేశా. లైన్ దొరకపట్టా. సార్‌‌ను కలిశా. పరిస్థితి వివరించా. కానీ, ఆఫీసుకెళ్తే ఇప్పుడు ఖాళీలు లేవనే సమాధానం వచ్చింది. దాదాపు సంవత్సరంన్నర విసిగిపోయా. అప్పుడే అనుకున్న నేనే ఒక పేపర్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని. ఆ ఆలోచనతోనే మన దునియాపేరిట ఆన్ లైన్ పేపర్ నిర్వహిస్తున్న. ఏది ఏమైనా మొదట జీతం కోసం చేరిన నాకు.. ఆ తర్వాత అదే జీవితం అయ్యింది.. అంటూ.. బరువెక్కిన హృదయంతో గొంతు సవరించుకుని.. ‘బాయ్‌ నరి’ అని తన సంభాషణ ముగించారు.. నమస్తే..

ముగింపు..

  • ఆయనతో మాట్లాడినంత సేపు నాటి జ్ఞాపకాలు నా కళ్లముందు గిర్రున తిరిగాయిఈ ఉద్యోగాన్ని వదిలాక నమస్తేగారు కొన్ని చిన్నచిన్న వ్యాపారాలు చేసినా.. అందులో ఇమడలేక.. మళ్లీ మన దునియానే నమ్ముకునే బతుకు సాగిస్తున్నారుఆ ఆన్‌లైన్‌ పేపర్‌‌తో వచ్చే సంపాదన విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం సంతృప్తిగా బతుకుతున్నారనే ధీమా మాత్రం కనిపించింది.
  • ఓకే ఫ్రెండ్స్.. బాయ్.. ఉంటాను..
  • ‘కలం వీడి.. హలం పట్టిన మరో చీకటి సూర్యుడి’ కథ(3వ ఎపిసోడ్‌ )తో మీ ముందుకు వస్తా..

– ఉప్పలంచి నరేందర్, డెస్క్‌ జర్నలిస్ట్, 

(మరిన్ని కథనాల కోసం.. చౌరాస్తాను క్లిక్‌ చేయండి)

 

You may also like...

10 Responses

  1. మన దునియా పేపర్ లింక్ ఇ స్త్తే … బాగుండు

  2. Unknown says:

    నమస్తే గారికి..'నమస్తే'.. నరేందర్ కు శుభాకాంక్షలు

  3. RAGHU says:

    పైన 'సాక్షి' బస్సుతో దిగిన ఫొటోలో నేనూ ఉన్నాను.. నమస్తేతో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా సరదాగా ఉండేవాడు.. కొంతమందికి వారి నడవడికకు అతికేలా పొలిటికల్ లీడర్ల పేర్లు పెట్టేవాడు. ఈ ఇంటర్వ్యూతో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసిన ఉప్పలంచి నరేందర్ కు అభినందనలు.

  4. jahangeer says:

    This comment has been removed by the author.

  5. Unknown says:

    ఎక్కడా కూడా నిజాయితీగా, నిక్కచ్చిగా, నిబద్ధతతో పనిచేయకూడదని.
    ఈ పదం నచ్చింది.. ఎందుకంటే ఇప్పుడు జరిగేది అదే కనుక.

  6. జీతం కోసం చేరితే జీవితం అయ్యింది సూపర్ శీర్షిక సర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *