Quality is an investment : నాణ్యతే పెట్టుబడి

Quality is an investment : నాణ్యతే పెట్టుబడి
  • ఆ అల్లంవెల్లుల్లి టేస్టే వేరబ్బా
  • హోంమేడ్‌ను తలపించేలా జింజర్ పేస్ట్
  • కొనేందుకు క్యూ కడుతున్న జనం
  • స్వయం ఉపాధి కోసం
  • జనగామ వాసి వినూత్న ఆలోచన
  • ఆటుపోట్లు ఎదుర్కొని సక్సెస్‌ వైపు అడుగులేస్తున్న జిమ్​ శ్రీను

ఈ ఆధునిక యుగంలో మానవ జీవన శైలీలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పు ఒక కోణంలో మంచిదైతే, మరో కోణంలో వినాశకానికి దారి తీస్తోంది.. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇప్పుడంతా కల్తీ కాలమే.. బిజీ ప్రపంచంలో రెడిమేడ్ మయమై ప్రజలు కల్తీ కాటుకు గురవుతున్నారు. అయితే జనగామకు చెందిన కందుకూరి శ్రీనివాసులు (జిమ్ శ్రీను)కు ఓ ఆలోచన పుట్టింది.. వివిధ ప్రైవేటు ఉద్యోగాలతో విసిగిపోయిన ఆయన స్వయం ఉపాధి వేటలో ఉన్న సమయమది.. కాకపోతే స్వామికార్యం, స్వకార్యం అన్నట్లుగా తాను స్వయం ఉపాధి పొందడంతో పాటు కల్తీ విముక్తి కోసం నడుంబిగించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వంటలో ప్రధాన పాత్ర పోషించే అల్లం వెల్లుల్లి పేస్టు వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లు నాణ్యతను నమ్ముకున్న తనకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అయినా వెనకడుగు వేయకా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాడు. చిన్నగా మొదలైన తన వ్యాపారం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పడు ఆ అల్లం ఘుమఘుమలు కేవలం జనగామకే పరిమితం కాకుండా హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల వరకూ వ్యాపించాయి. నాణ్యతలో రాజీ పడకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ.. పది మందికి ఉపాధి కల్పిస్తూ మార్కెట్‌లో ఆదర్శంగా నిలుస్తున్న ‘అల్లం శ్రీను అలియాస్​ జిమ్‌ శ్రీను’పై చౌరాస్తా ప్రత్యేక కథనం..



జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : కాలాన్ని బట్టి మనుషుల అలవాట్లు, ఆహార పద్ధతులు మారుతున్నాయి. సమయం, ఓపిక లేకపోవడంతో ప్రజలు రెడిమేడ్ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో అనార్థాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆహార పదార్థాల్లో అల్లంవెల్లుల్లి పేస్టు పాత్ర ముఖ్యమైనది. ఏ కూర వండినా అందులో ఇది ఉండాల్సిందే. ఒకప్పుడు రోటిలో అల్లంవెల్లుల్లి వేసి చక్కగా రుబ్బుకొని తయారుచేసుకునేవారు. ఇది చాలా సమయంతో కూడుకున్న పని కావడంతో కాలక్రమేణా రెడిమేడ్‌గా అల్లం తయారుచేసే కంపెనీలు పెరిగిపోయాయి. కానీ ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో మనకు నిరాశే ఎదురవుతోంది. అందుకే జనగామకు చెందిన జిమ్ శ్రీను క్వాలిటీ అల్లంపేస్టు అమ్మాలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పటికే ఆయన వివిధ ప్రైవేటు ఉద్యోగాలు చేసి విసిగివేసారిన శ్రీనుకు స్వయం ఉపాధితో స్థిరపడాలన్న ఆలోచన తట్టింది. బయట స్వచ్ఛమైన ఆహార పదార్థాలు దొరకడం లేదని, ఏదైనా ఫుడ్ ఐటమ్ బిజినెస్ పెడితే బాగుంటుందని ఆలోచించాడు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే వంటలో కీలకమైన అల్లంపేస్టు ఎక్కడా నాణ్యమైనది దొరకడం లేదని ఆయన తెలుసుకున్నాడు. దీంతో ఆ బిజినెస్​కు బీజం వేశారు.

Quality is an investment : నాణ్యతే పెట్టుబడి
ఒక్కడితో మొదలై..
అల్లం పేస్టు దుకాణం ఆలోచన బాగానే ఉన్నా అది నడపాలంటే పెద్ద ప్రక్రియనే ఉంది. దానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేకపోవడంతో జిమ్ శ్రీను బాగానే శ్రమించాల్సి వచ్చింది. దానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి మెషినరీ లేకపోవడంతో కాజు, పసుపునకు సంబంధించిన మెషీన్లను మరమ్మతులు చేయించి అల్లం పేస్టుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఆ తరువాత 2017 సంవత్సరంలో అల్లం పేస్టు తయారీ మినీ పరిశ్రమను శ్రీను జనగామలో ప్రారంభించారు. మొదట్లో తయారీ మొదలు దుకాణంలో అమ్మడంతో పాటు చిన్నచిన్న కిరాణా దుకాణాలకు సప్లయ్ చేసే పనులన్నీ ఒక్కడే చూసుకున్నాడు. అయితే.. మొదటి ఆరు నెలల వరకు తమ వ్యాపారం నష్టాల్లోనే సాగింది. అప్పటికే ఇలాంటి షాపులు జనగామలో ఏడెనిమిది ఉన్నాయి. క్వాలిటీ విషయంలో శ్రీను కాంప్రమైజ్ కాకుండా షాపు నడపడంతో మెల్లమెల్లగా గిరాకీ పెరిగింది. అచ్చం ఇంట్లో రుబ్బినట్టుగానే అల్లం రుచి ఉండడంతో మౌత్ పబ్లిసిటీ బాగా వచ్చింది.

Quality is an investment : నాణ్యతే పెట్టుబడి
అవరోధాలను అధిగమించి..
ప్రస్తుతం జనగామ పట్టణంలోని స్వర్ణకళా మందిర్ ఏరియాలో ‘శ్రీ శారద అల్లం వెల్లుల్లి పేస్టు’ పేరుతో శ్రీను తన షాపును నడిపిస్తున్నారు. ఈ షాపు ప్రస్తుతం సక్సెస్‌ ఫుల్‌గా నడవడం వెనుక ఎన్నో అవరోధాలున్నాయి. అప్పుడప్పుడే గిరాకీ పెరుగుతున్న సమయంలో కొందరు వ్యాపారుల కన్ను ఈ షాపుపై పడింది. నాణ్యత విషయంలో శ్రీను రాజీపడకపోవడంతో షాపును మూసివేయించేందుకు కొందరు కుట్రలు చేశారు. అధికారులతో దాడులు చేయించారు. ఓ సారి ఆహార భద్రత అధికారులు దాడులు చేయగా క్వాలిటీని చూసి అవాక్కయ్యారు. గుడ్ క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చి ప్రశంసించారు. ఇలా.. తాను నమ్ముకున్న నాణ్యతనే తనను ఎన్నో సార్లు రక్షించిందని శ్రీను చెప్పుకొచ్చారు.

Quality is an investment : నాణ్యతే పెట్టుబడి
తయారీ విధానం ఇలా…
అల్లంవెల్లుల్లి పేస్టు తయారీకి కొన్ని మెషీన్లను వినియోగిస్తున్నారు. ముందుగా అల్లంవెల్లుల్లిలో పుచ్చులు లేకుండా చూస్తారు. నాణ్యమైన అల్లం, వెల్లుల్లిని వేర్వేరు మెషీన్లలో వేసి పొట్టును తొలగించి శుభ్రం చేస్తారు. ఆ తరువాత మరో మెషీన్లో ఈ రెండింటితో పాటు ఉప్పును వేసి దంచుతారు. ఆ తరువాత ప్యాకింగ్ చేసి తమ షాపుతో పాటు వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు పంపిస్తారు.



రోజుకు రెండు క్వింటాళ్ల అమ్మకాలు..
ప్రస్తుతం రోజుకు 200 కిలోల అల్లం పేస్టు అమ్ముడుపోతోందని శ్రీను తెలిపారు. స్వర్ణకళా మందిర్ వద్ద గల షాపులో రోజుకు సుమారు 60 కిలోల వరకు విక్రయిస్తుండగా.. బయటకు 150 కిలోల వరకు వెళ్తోంది. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనచారి కుక్ కూడా ఇక్కడే అల్లం పేస్టు తీసుకుంటారంటే క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా జనగామ జిల్లాతో పాటు వరంగల్, హైదరాబాద్‌లోని పేరుగాంచిన హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు ఇక్కడి నుంచే అల్లం పార్శిల్ వెళ్తోంది. తన స్వయం ఉపాధి కోసం అల్లం పేస్టు వ్యాపారాన్ని ప్రారంభించిన శ్రీను పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగారు. ఆయన వద్ద సుమారు పది మంది వర్కర్లు పనిచేస్తున్నారు. నాణ్యతను నమ్ముకుని ఆటుపోట్లను ఎదురించి పైకి ఎదుగుతున్న శ్రీను ఇప్పుడున్న యువతకు ఆదర్శమే కదా..

Quality is an investment : నాణ్యతే పెట్టుబడి

ఇంట్లో చేసినట్టే ఉంటది
మా ఇంట్లో కొన్ని సార్లు ఫంక్షన్లు అయినప్పుడు బయట దుకాణాల్లో అల్లం పేస్టు కొన్నాను. ఇంట్లో చేసుకున్నదానికి, బయట కొన్నదానికి తేడా ఉంటది కదా. కానీ ఓసారి ఇక్కడ తీసుకుంటే అచ్చం ఇంట్లో నూరుకున్నట్టే ఉన్నది. నాలుగేళ్ల నుంచి అల్లంపేస్టు ఇక్కడ కొంటున్నా. మా ఊరు నుంచి చాలా మంది ఇక్కడికి వస్తారు.
– నమిలె శివ, గానుగుపహాడ్, జనగామ మండలం

ఓపిక, నిలకడతోనే సక్సెస్
ఓపిక, నిలకడ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నా బిజినెస్ సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలున్నాయి. నా స్నేహితులు ఎంతో సహకరించారు. నా భార్య జయశ్రీ కూడా ఎంతో కష్టపడింది. ఒకప్పుడు ఉపాధి లేని నేను ఇప్పుడు పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి రావడం సంతోషంగా ఉంది. కొత్త బిజినెస్‌తో మార్కెట్‌లోకి వచ్చే వారు ఎంత నాణ్యత, నమ్మకంగా ఉంటే అంత సక్సెస్‌ లభిస్తుంది.
– కందుకూరి శ్రీనివాసులు, ప్రొప్రెటర్

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

 

You may also like...