కొనసాగుతున్న ‘ప్రజా పాలన’
- పరిశీలించిన జిల్లా కలెక్టర్
జనగామ, చౌరాస్తా : జనగా జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ముమ్మరంగా కొనసాగుతోంది. ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ శివలింగయ్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గురువారం జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద ఉన్న సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మర్ పింకేశ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. దరఖాస్తు కేంద్రానికి వచ్చే వారికి కావాల్సిన సమాచారం ఇస్తూ ఫారాలను ఎలా నింపాలో తెలపాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
- జిల్లా వ్యాప్తంగా ఇలా…
జనగామ జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో గురువారం దరఖాస్తుల స్వీకరణ జరిగింది. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, జనగామ అర్బన్, జనగామ రూరల్ కలుపుకుని మొత్తంగా 17 సభలు నిర్వహించగా 8,594 దరఖాస్తులు వచ్చాయి. ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని రఘునాథపల్లి, లింగాలఘణపురం, స్టేషన్ ఘనపూర్, చిల్పూర్, జాఫర్గఢ్లో మొత్తం 18 సభలు నిర్వహించగా 10,997 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల్లో 11 గ్రామ సభలు నిర్వహించగా 6,604 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా మూడు పరిధిలో 46 గ్రామ, వార్డు సభల ద్వారా గురువారం 26,195 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వివరించారు.