mla pa : ఆ పీఏ.. మామూలోడు కాడు..!
- పవర్ ఆఫ్ ఎమ్మెల్యే..!వ
- వచ్చేది ఐదంకెల జీతం..!
- ఆస్తులు మాత్రం రూ.కోట్లలో..
- అక్రమార్జనలో ఆయనే నంబర్ వన్ అంట..!
- నమ్మిన వారికే పంగనామం పెట్టే ఘనుడంట..!
పీఏ.. అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు..! మరేంటీ అనుకుంటున్నారా.. ‘పవర్ ఆఫ్ ఎమ్మెల్యే..!’ అవును జనగామ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పీఏ తీరు అలాగే ఉంది. ఓ సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. అప్పట్లో తన సొంతూరు నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే ఆర్టీసీ బస్సు తప్ప వేరే ప్రయాణాలు తెలియని ఆయన.. ఇప్పుడు కోట్లకు పడగెత్తి.. లెగ్జరీ కారు, బులెట్ బండి వేసుకుని చక్కర్లు కొడుతున్నాడు. అంతా సాదాసీదా మనిషికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..? కేవలం ఐదు అంకెల జీతంలో పనిచేస్తూ ఇంతలా ఎలా కూడబెడుతున్నాడు..? అంటూ సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నారు.
బెదిరింపులు..పైరవీలు..
అధికార పార్టీ లీడర్ వద్ద పనిచేస్తున్నఆ పీఏ బెదిరిపులు, పైరవీలకు అడ్డూఅదుపు లేదని తెలుస్తోంది. కానిస్టేబుళ్లు స్థాయి నుంచి పైస్థాయి ఆఫీసర్ల వరకు, కొన్ని ప్రభుత్వ శాఖ అధికారుల ట్రాన్సఫర్లు, పోస్టింగ్‌లు కోసం ఆయన పెద్ద ఎత్తున ఫైరవీలు చేస్తూ ముడుపులు స్వీకరిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు నుంచి జిల్లాకు వచ్చిపోయే ఆయన ఇటీవల జిల్లా కేంద్రంలో కోట్లు వెచ్చించి ఇంటి నిర్మాణాకి ప్లాన్ చేస్తున్నాడంటే అయ్యారి సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటికి కావాల్సిన సిమెంట్, ఇసుక ఇతర ముడిసరుకుల కోసం కొంత మంది కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పీఏ ఆగడాలను తట్టుకోలేక గతంలో కొందరు వ్యాపారులు సదరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ఎమ్మెల్యే సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒక దశలో ఉద్యోగం నుంచి తొలిగించేందుకు నిర్ణయం తీసుకోగా.. ఎమ్మెల్యే దగ్గరి బంధువు ప్రమేయంతో బ్రతిమిలాడితే చివరి అవకాశంగా హెచ్చరించి డ్యూటీలో ఉండనిచ్చినట్టు సమాచారం. అయినా పీఏ తీరు మారలేదని తెలుస్తోంది. మరోవైపు ఓ బడా కాంట్రాక్టర్ ఇంటిలో కుటుంబ సభ్యుడిగా మెదిలి జిల్లా కేంద్రంలో ఆయన చేసే ప్రతి పనిలో తన భాగస్వామ్యం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
నంబర్లు మార్చి కాల్స్..
ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యేను మాట్లాడించే సమయంలో ఆ పీఏ తెలివిగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు ఫోన్ చేయాలంటే ఎమ్మెల్యే ఫోన్ లో నుంచి కాల్ చేయడం, అధికారులకైతే తన స్వంత ఫోన్ తో కాల్ చేసి మాట్లాడించటం పరిపాటిగా మారింది. దీంతో చాలా మంది ఆఫీసర్లు పీఏ నంబర్ ను ఎమ్మెల్యే నంబర్ గా అనుకుంటున్నారు.
పక్కన ఉంటూనే..
సదరు ఎమ్మెల్యే వద్ద దాదాపు 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఆ పీఏ గతంలో ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడి వద్ద కూడా పనిచేశారు. మరో నాలుగైదు నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంతో తనపై ఉన్న ఆరోపణలను తిప్పి కొడుతూ క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యేకు పీఏ చేసే తప్పిదాలతో కూడా చెడ్డ పేరు వస్తుందని సొంత పార్టీ లీడర్లే చర్చించుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్ గా హాజరైన కొన్ని కార్యక్రమాల్లో స్థానిక లీడర్ల చెప్పిన విధంగా కాకుండా పీఏ ఇష్టారీతిగా వ్యవహరించినట్టు తెలిసింది. దీంతో పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న ఆ లీడర్లు ఎమ్మెల్యేకు తమ నిరసన కూడా తెలియజేశారు. అయితే పీఏ ఇందంతా కావాలనే చేస్తున్నాడని, తమను ఎమ్మెల్యేకు దూరం చేయాలని చూస్తున్నాడని వారు అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేకు నమ్మిన బంటుగా నటిస్తూనే ప్రత్యర్థులకు ఇక్కడి సమాచారం చేరవేస్తూ వారితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తున్నారు. దీని ఫలితంగా పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)