మియాపూర్ ఎస్సై సస్పెండ్
హైదరాబాద్, చౌరాస్తా :మియాపూర్ ఎస్ఐ గిరీష్ ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ఓ కేసులో తన దగ్గరకు వచ్చిన మహిళతో ఎస్ఐ సన్నిహితంగా మెలిగారనే ఆరోపణల నేపథ్యంలో మహంతి విచారణ జరిపించారు. నిజమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
వివరాల్లోకి వెళితే.. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్ కుమార్ మియాపూర్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నాడు. ఇటీవల బ్యూటీషియన్‌గా పని చేస్తున్న ఓ మహిళ చీటింగ్ కేసు విషయమై స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తన ఫ్రెండ్ బిజినెస్ పేరుతో సుమారు రూ.6 లక్షలు మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కంప్లైంట్‌ను పరిశీలించిన ఎస్సై.. సదరు వ్యక్తిని విచారణకు పిలిపించారు. అనంతరం అతని వద్ద నుంచి డబ్బు రికవరీ చేయించారు.
కేసు అప్పటికే ముగిసినప్పటికీ.. ఎస్సై గిరీష్ కుమార్ సదరు బ్యూటీషియన్ ఫోన్ నంబరు తీసుకుని వెంటపడ్డాడు. వాట్సాప్‌కు మెసేజ్‌లు పంపిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. సీపీ విచారణకు ఆదేశించగా…వేధింపులు నిజమని తేలటంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది.