journalism : నక్సలిజం నుంచి..

journalism : నక్సలిజం నుంచి జర్నలిజంకు..
journalism : నక్సలిజం నుంచి..
naxalism to journalism : ‘జర్నలిజంలో ఉన్నోడు ఎందుకు పనికి రానోడు అయిపోతుండు. ప్రస్తుతం జర్నలిస్టు బతుకు ‘గంజిల ఈగ లెక్క’ అయితాంది. ఇప్పడు ఈ ఫీల్డ్‌కు రెండు రకాల వారు వస్తున్నరు. ఒకటి సమాజానికి సేవ చేయాలనే ఆలోచన  ఉన్న వారు. రెండు సమాజాన్ని లూటీ చేయొచ్చు అనే భావనతో ఉన్నోళ్లు.  సో ఈ రెండో రకం వాడికి పక్కా స్కీం ఉంటది. కాబట్టి వాడు మీడియాలో  అడ్జస్ట్‌ అవుతడు. ఉన్న స్థాయికి వెళ్లే అవకాశం కూడా వాడికి ఉంటది. ఎటొచ్చి సమాజానికి సేవ చేయాలని వచ్చే వాడికే అసలైన ఇబ్బంది. ముందు ఏదో అనుకుని జర్నలిజంలోకి వస్తడు. తీరా వచ్చినంక వాడు అనుకున్న ముఖచిత్రం తలకిందులైతది. అప్పుడు ఇందులో ఉండలేడు. అటు బయటకు పోలేడు.. కానీ నేను ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకుని బయటకు వచ్చా.. రైతులా బతకాలనుకున్నా బిందాస్‌గా బతుకుతున్న..అని సీనియర్‌‌ డెస్క్ జర్నలిస్టు, అగ్రికల్చర్‌‌ జర్నలిస్టు ఆవార్డు గ్రహీత జిట్టా బాల్‌రెడ్డిగారు తన మనోగతాన్ని వివరించారు. ‘కొత్త దారిలో.. పాత మిత్రులు’ శీర్షిక కోసం ఆయనను కలిసేందుకు వెళ్లి నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నా. నిత్యం ఓ కొత్త దనంతో ముందుకు సాగుతున్న బాలన్న గురించి రాయాలంటే ఒక రోజు, ఒక పుస్తకం సరిపోదేమో అనిపించింది. కానీ ఆయన కథ విన్నాక రాయాలనే కసి మరింత పెరిగింది. నల్లగొండ యాసలో మాండలికాలతో ఆయన మాట్లాడే తీరు ఎదుటి వారిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. మరెందుకు ఆలస్యం ఆ ముచ్చట్లు తెలుసుకుందా.. పదండి..  

అన్న నమస్తే.. ముందు మీకు థ్యాంక్స్‌.. మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు..

ఏం పర్లేదన్న.. మీ ‘కొత్త దారిలో..’ కాన్సెప్ట్‌ బాగుంది. అందుకే మీరు అడగ్గానే రమ్మన్నాను.

అన్న మీ చదువుసందెల ముచ్చటేంది?

నా సదువంతా వానాకాలం సదువేనే.. నాకు నాలుగేళ్లప్పుడే అమ్మ పోయింది. మేనమామలు పెంచిన్రు. ఈసీఎల్‌ నాగారం స్కూల్‌లో టెన్త్‌ వరకు చదివిన. 7వ తరగతిలోనే నాకు ఆర్‌‌ఎస్‌యూ రాజకీయాలు పరిచయమైనయ్‌. టెన్త్‌కు వచ్చేసరికి ఆర్‌‌ఎస్‌యూ ఓల్డ్‌ టైమర్‌‌ను. ఇంటర్‌ (మేడ్చల్‌ జూనియర్ కాలేజీలో)‌ డిస్‌కంటిన్యూ చేసి ఉద్యమం వైపు అడుగేసిన.

ఉద్యమమా? కొంచెం వివరంగా చెప్పరు.

ఇంటర్‌‌కు వచ్చే సరికి నాకు చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే కాలేజీలో ఓసారి కొందరు భూస్వాముల కొడుకులు ఓ దళిత విద్యార్థిని కాళ్లల్లో కాళ్లు పెట్టి పడేసిన్రు. అయితే వాళ్లను పట్టుకుని ఇర్గమర్గ కొట్టి కాలేజీలో ఉన్న 235 మంది అమ్మాయిల కాళ్లు మొక్కించిన. అట్లా భూస్వాముల కంట్లో పడ్డా. వాళ్లు నన్ను కాలేజీలనే చంపాలని ప్లాన్‌ చేశారు. అదే టైంలో ఉద్యమ అవసరాలు కూడా పెరిగినయ్‌. మైదాన ప్రాంతాల నుంచి అడవికి పార్టీ ఎక్స్‌టెండ్‌ అవుతోంది. అట్లా నన్ను ఏటూరునాగారం ఏజెన్సీలో పనిచేసేందుకు పార్టీ ఎంపిక చేసి పంపింది. 1983 మార్చిలో ఆడవిలో అడుగుపెట్టిన. 2000 సంవత్సరం వరకు అందులోనే పనిచేసిన. లొంగిపోయిన ఆ తర్వాత ఓపెన్‌ డిగ్రీ (ఎంఏ) పూర్తి చేసిన. ఫ్రెంచ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను.

పార్టీలో ఎక్కడెక్కడ పనిచేశారు?

మొదట ఏటూరునాగారం ఏజెన్సీలో పని చేసిన. తర్వాత కొతంకాలం ట్రెడ్‌ యూనియన్‌లో, అర్బన్‌ మూమెంట్స్‌లో, పార్టీ ఆమ్స్‌ అండ్ రిక్రూర్‌‌మెంట్ ‌ వింగ్‌లో కూడా చేసిన. 1989 శ్రీకాకులంలో ఉద్యమాన్ని పునర్నిర్మించాలనుకున్నప్పుడు అక్కడి అటవీ దళాల కమాండర్‌‌గా వెళ్లిన. అనంతరం ఏవోబీలో  పని చేసిన. తర్వాత కిడ్నీలు పాడై అప్పటి డీజీపీ దొర గారి ముందు లొంగిపోయిన. అప్పుడు దొర ప్రెస్‌మీట్‌ పెట్టారు. నాటి సంభాషణ నేనెప్పటికీ మర్చిపోను..

  • దొర : ఏం చేద్దాం అనుకుంటున్నవ్.?
  • నేను : కంప్యూటర్‌‌ లిటరేట్ నవ్వాలను కుంటున్నా సార్..
  • దొర : అది ఏకే 47 అంత ఈజీ కాదు.
  • నేను : ఏకే 47 కంటే అదే ఈజీ సార్‌‌..
  • దొర సప్పుడు చేయలే గాని.. ఇంతలో ఓ రిపోర్టర్‌‌ ఎలా అని ప్రశ్నించాడు.
  • నేను : సార్‌‌.. ఏకే 47 తో పొరపాటు గురి  పెడితే ఓ వ్యక్తి  ఓ పానం పోతది. అలా జరిగిన నష్టాన్ని నేను పూడ్చుకోలేను. కానీ, కంప్యూటర్‌‌ మీద ఓ తప్పు చేస్తే.. కంట్రోల్‌ జెడ్‌ కొట్టి సరిచేసుకోవచ్చు.. అందుకే ఏకే 47 కంటే కంప్యూటర్  హ్యాండిల్‌ చేయడం చాలా ఈజీ అని చెప్పాను.

journalism : నక్సలిజం నుంచి..



జర్నలిజం వైపు ఎలా వచ్చారు? (naxalism to journalism)

చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా బతికిన నాకు పార్టీ నుంచి వచ్చాక ఎలా బతకాలనేది ఓ సవాల్‌. లొంగిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదు. ఇంట్లో వాళ్లను అడగనీకె ఇష్టం లేదు. మొదట ఓ కార్పొరేట్‌ కాలేజీలో (నారాయణ) క్లర్క్‌గా చేరిన. అక్కడే కంప్యూటర్‌‌ నేర్చుకున్నా. కొన్ని రోజులకు ‘విజేత’  పేపర్‌‌లో సబ్‌ ఎడిటర్లు కావలెను అని ప్రకటన చూసి ఆ ఆఫీస్‌కు పోయా. ఇప్పడు మద్రాస్‌ యూనివర్సిటీలో తెలుగు విభాగం ప్రొఫెసర్‌‌గా చేస్తున్న సంపత్‌ గారు అప్పుడు విజేత ఎడిటర్‌‌.  ఇంటర్వ్యూకు వెళ్లిన నాకు ఇండో పాక్‌ రిలేషన్స్‌, ఉమన్‌ ఎంపవర్‌‌మెంట్‌ మీద రెండు ఆర్టికల్స్‌ రాయమన్నరు. 3 గంటలు సమయం ఇస్తే.. గంటన్నరలో పూర్తి చేశా. చూసి బాగుందని తెల్లారి వచ్చి జాయిన్‌ కమ్మన్నారు.  అలా జర్నలిజంలోకి అడుగు పెట్టిన.

సీరియల్స్‌ ఎడిటింగ్‌ కూడా చేశారని విన్నా..?

విజేతలో చేస్తున్న టైంలో తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది. అప్పుడు తెలంగాణ మీద ఓ డాక్యుమెంట్రీ చేయాలని ఓ ఫ్రెండ్‌ పూనుకున్నాడు. ఆ మేకింగ్‌ టీంలో ఒకడిగా ఉన్న నాకు ఎడిటింగ్‌పై దృష్టి పడింది. ఎడిటింగ్‌ చేసే శ్రీగుహ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర విజివల్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌ నేర్చుకున్నా. మ్యాన్‌ వల్‌గా ఎడిటింగ్‌ బుక్‌ను కూడా పూర్తిస్థాయిలో చదివిన. అదే సమయంలో రామోజీ ఫిలింసిటీలో ఎడిటర్ల కోసం ఇంటర్వ్యూ చేస్తున్నరని తెలిసి వెళ్లిన. సెలెక్ట్‌ అయ్యా.. కానీ రెండేళ్లకే అక్కడ నా సేవలు చాలించా.

సహఉద్యోగిని కొట్టారంటా?

అవును.. (నవ్వుతూ..) ఏదైనా మంచి కంటే చెడు జల్ది పాకుతది. ఫిలింసిటీలో దాదాపు రెండేళ్లు పనిచేసిన. ఒరియా ఎంట‌ర్‌‌టైన్మెంట్‌లో 1400 ఎపిసోడ్‌లు చేసిన. అందులో పని చేస్తున్న సందర్భంలో నన్ను ఉత్తరాంధ్రకు చెందిన రెడ్డి అనుకునే వారు. ఓ సహ ఉద్యోగి తెలంగాణ వాళ్లకు పని రాదు. అనేటోడు. ఎందుకు సార్ మనకు రీజనల్ ఫీలింగ్స్‌ అన్నా ఊరుకునేటోడు కాదు. ఒక సారి ఏకంగా తెలంగాణ లం.. కొడుకులకు పని రాదు అన్నడు. ఇక నాకు కోపం కట్టలు తెంచుకుంది.. వాడి దవడ వాచిపోయింది. రెండు రోజులకు నా ఉద్యోగం పోయింది. (నవ్వుతూ..) ఆ తర్వాత ఫిలిం ఎడిటింగ్‌ కోసం సినిమా రంగం వైపు చాలా ప్రయత్నాలు చేసిన. ఎక్కడా అవకాశం దొరకలె. కొన్ని రోజులకు ఆంధ్రజ్యోతి లాక్‌ అవుట్‌ తర్వాత (2003లో అనుకుంటా) రీఓపెన్‌ అయ్యింది. అందులో సబ్‌ ఎడిటర్‌‌గా చేరా. కానీ అక్కడా ఆర్నెళ్లు దాటలె.. ‘యదార్థ వాది లోక విరోధి’ అన్నట్లు మారింది నా పరిస్థితి. ఎక్కడ పని చేసినా ముక్కు సూటిగా మాట్లాడేటోన్ని. అదే నాకు ముప్పు తెచ్చింది.



గన్‌.. పెన్‌ కాదు గంటె కూడా పట్టారంట?

అన్నా.. నేను పని చేసేందుకు ఎప్పడూ సిగ్గుపడలె. దళంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సమయం దొరికితే రైతులతో పొలం పనులు చేసేటోన్ని. పార్టీ కోసం ఆటో నడిపిన రోజులు ఉన్నయ్. ఇక ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం పోయాక కొన్ని రోజులు ఫొటోగ్రాఫర్‌‌గా పనిచేశా. క్యాట్రింగ్‌ వర్క్‌ కూడా చేశా. ఓ సారి బషీర్‌‌భాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్‌కు వెళ్తే ఓ సీనియర్‌‌ జర్నలిస్టు (పేరు వద్దులే) నా గురించి అన్ని తెలిసిన వ్యక్తి. ‘ఏం చేస్తున్నవ్‌’ అన్నడు. క్యాట్రింగ్‌ వర్క్‌ చేస్తున్నా సార్‌‌ అన్నా.. అందుకు ఆయన ‘ఓహో గంటె తిప్పుతున్నావా..’ అని వెటకారం చేసిండు. అప్పుడు నేను ‘నా గన్‌కు ఎంత పదునుందో.. గంటెకు కూడా అంతే పదునుందని చూపిస్తున్న’ అని సమాధానం ఇవ్వడంతో బిక్క ముఖం వేసుకుని పక్కకు పోయిండు.  

పతంజలి సార్‌‌తో మీ అనుబంధం..

ఫొటోగ్రఫీ, క్యాట్రింగ్‌ పనుల తర్వాత ఆంధ్రప్రభలో చేరా. అక్కడ ఏబీకే గారు, పతంజలి గారితో పరిచయమైంది. ఒక సంవత్సరం పాటు సాఫీగా సాగినా ఆ తర్వాత అదీ మూత పడింది. మళ్లీ పతంజలిగారు ఎడిటర్‌‌గా సాక్షి లాంచింగ్‌ టైంలో ఆయనే నన్ను పిలుచుకుని పీఏగా పెట్టుకున్నారు. సార్‌‌తో నాకు మంచి అనుబంధం ఉంది. సార్‌‌ ఎక్కడ ఉన్నా అక్కడ బాల్‌రెడ్డి ఉంటడు అనేటోళ్లు. జర్నలిజంలో నాకు ఆయనే గురువు. ఆయన కాలమ్స్‌ చదివి ఎన్నో నేర్చుకున్నా. జర్నలిజంలో నెగిటివిటీని కూడా ఆయన చెప్పారు. జర్నలిస్టుల మీద సార్‌‌ ‘పెంపుడు జంతువులు’ అనే ఓ పుస్తకం రాశారు. ఈ రోజు జర్నలిస్టులు ఎలా తయారయ్యారో 20 ఏళ్ల కిందే ఆయన ఆ పుస్తకం రాశారు. సార్‌‌ సెటేరిక్‌ మాట్లాడే తీరు నాకు భలే నచ్చేది.

‘ఓ సారి ఏమైందంటే.. నేను ఫ్రెంచ్‌ యూనివర్సిటీలో చదువుకున్న టైంలో నా సాహిత్యాన్ని, డిజైనింగ్‌ను చూసి పారిస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో స్కాలర్‌‌ షిప్‌ వచ్చింది. ఇండియా నుంచి కేవలం ఇద్దరు మాత్రమే సెలెక్ట్‌ అయ్యారు. అందులో నేనూ ఒకడిని. అదే సమయంలో మా నాన్న నాకు పంచి ఇచ్చిన భూమి తాలుకు పట్టాపుస్తకం వచ్చింది. ఆ రెంటిని పతంజలి గారికి చూపించేందుకు వెళ్లాను.. సార్‌‌ నన్ను చూసి ‘మిత్రమా నీకు విజ్ఞత ఉంది. అందుకే దేని స్థానం దానికే ఇచ్చినవ్‌..’ అన్నారు. అప్పుడు ఒక్కసారి నేను నా చేతుల వైపు చూసుకుంటే అర్థమైంది. నా ఎడమ చేతిలో పారిస్‌ లెటర్‌‌ ఉంది. కుడి చేతిలో మా అయ్య  ఇచ్చిన భూమి పాస్‌బుక్‌ ఉంది. అలా వ్యవసాయ ప్రస్థానం మొదలైంది

మీడియాలో అగ్రవర్ణాలు రాణిస్తుంటారు. మీ విషయంలో అది జరగలేదు.

నవ్వుతూ.. అన్న నా పేరుకు తోక ఉంది. కానీ నా వెనుక ఎర్రజెండా ఉంది. పీపుల్స్‌వార్‌‌ వాడు అంటే ఎవరికైనా చుచ్చే కదా (నవ్వుతూ).. సినీమా రంగంలో నాకు అకాశం రాకపోవడానికి కారణం కూడా అదే. ఫిలింసిటీలో బంద్‌ చేసిన తర్వాత ఓ సారి ఉద్యోగం కోసం ఓ స్టూడియోకు వెళ్లిన. అప్పడు అక్కడి బాస్ ఓ మాటన్నరు. రెడ్డి మీరు మంచి ఎడిటర్ అని తెలిసింది. కానీ మీకు డ్యూటీ మాత్రం ఇవ్వలేను. ఎందుకో మీకు తెలుసు అని సున్నితంగా చెప్పి తప్పించుకున్నరు. ఇక డెస్క్‌లో పని గురించి నీకు కూడా తెలిసు కదా. ‘నడిచే ఎద్దునే పొడిచినట్లు..’ పని చేసే వాడితోనే చేపిస్తుంటరు. ఇక పని రానోడు పెద్దలను గీకుడో, జోకుడు చేసి గట్టెక్కుతడు. నేను అసోంటోన్ని కాను. నాకు ఇచ్చిన పనిని చేసుకుంటూ పోయేటోన్ని. పని వచ్చు అనే పొగరూ ఉండదు. ఆఫీస్‌ గేట్‌ సెక్యూరిటీ నుంచి ఎడిటర్‌‌ వరకు అందరితో ఒకేలా ఉండేటోన్ని. అందరూ బాలన్న అని ప్రేమగా పిలిచేటోళ్లు. ఆ పిలుపే నాకు పెద్ద హోదాగా ఫీల్‌ అయ్యే వాడిని.



సాక్షిలో మీ జర్నీ?

సాక్షిలో దాదాపు ఏడేళ్లు పనిచేసిన. ఇక్కడ మధ్యాహ్నం వరకు వ్యవసాయ పనులు చేసుకుని ఆఫీస్‌కు అప్‌ అండ్‌ డౌన్‌ చేసేది. రోజుకు 20 గంటలు పనిచేసేది. నా నిద్రంతా బస్సులోనే ఉండేది. పతంజలి గారి వద్ద దాదాపు ఏడాది పాటు పీఏగా చేసిన. ఆయన ఆనారోగ్యం బారిన పడి చనిపోవడంతో  చాలా కుమిలిపోయా. ఆ తర్వాత నన్ను ఢిల్లీ డెస్క్‌లో వేశారు. అందులో శానా రోజులు పనిజేసిన. రెండు పేజీ (బ్రాడ్‌ షీట్‌)లు ఒక్కడినే పెట్టేది. అప్పటి ఇంచార్జి కావాలని ఇబ్బంది పెడుతుంటే. బాస్‌ కదా బాసిజం చేయాలని చూస్తుండే. రోజుకు దాదాపు 40 ఐటెంలు (ట్రాన్స్‌ లేషన్‌) వేసేది. సెంట్రల్‌ డెస్క్‌లో కూడా మూడు ఐటెంలు మించి చేయరు. అసోంటిది నేను 40 చేసేది. మొదట్లో కాస్త కష్టం అని పించేది. తర్వాత అలవాటైపోయింది. ఇంకో ఇంచార్జి అయితే మా బామ్మర్ది చనిపోతే సెలవు అడిగితే.. ‘అయ్యో నువు లేకుంటే డెస్క్‌ ఎట్లా అన్నడు..’ నాకు ఒక్కసారిగా మంటలేసి ‘సచ్చినోడు నా సొంత బామ్మర్ది రా..!’ అన్నాను.. ఇక అంతే కిమ్మనలేదు. తెల్లరి వెళ్లాక మళ్లీ అతడే నా వద్దకొచ్చి సారీ చెప్పాడు.

journalism : నక్సలిజం నుంచి..
సాగుబడి ఆలోచన మీదేనా?

సాక్షిలో సాగుబడి పేజీ రూప కల్పన చేసింది నేనే. ఇప్పుడు అసోసియేట్‌ ఎడిటర్‌‌గా ఉన్న టీ.వేణుగోపాల్‌గారు అప్పట్లో నాతో బండిపై వీఎస్టీ చౌరస్తా వరకు వచ్చేటోడు. ఓ సారి బాల్‌రెడ్డిగారు అగ్రికల్చర్‌‌ పేజీ కోసం ప్లాన్‌ చేయాలండి అన్నాడు. అప్పడు నా ఆలోచనలు ఆయనతో పంచుకున్నా. ఆయన ఎడిటోరియల్ డైరెక్టర్‌‌కు చెప్పడం, తర్వాత చైర్‌‌పర్సన్‌ భారతి మేడం ఓకే చెప్పడంతో సాగుబడి పేజీ మార్కెట్‌లోకి వచ్చింది. అలా అగ్రికల్చర్‌‌ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే నాకు అగ్రికల్చర్‌‌ జర్నలిస్టు అవార్డు వచ్చింది. అంత వరకు బాగానే ఉన్నా.. డెస్క్ లో పని చేసేది నేనైతే. పేరొచ్చేది మాత్రం ఇంకోలకి.. అదే నాకు నచ్చలేదు. ఇంకోటి సబ్జక్టు నాలెడ్జ్‌ ఉన్నోడు.. కచ్చితంగా ఎవరికీ లొంగి ఉండడు.. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను… 

రేపటి నుంచి పూర్తి స్థాయి రైతుగా బతకాలనుకున్నా.. ‘ఐయామ్‌ క్విట్టింగ్‌ దిస్‌ బ్లడీ జాబ్‌..’ అని ఫేస్‌ బుక్‌లో పోస్టు పెట్టి తెల్లవారి నుంచే ఉద్యోగం మానేశా.. 

అంటూ ఎంతో ఎమోషనల్‌గా తన కథ చెప్పిన బాలన్న.. అంతే ప్రేమతో అమ్మా అమేయా.. అన్నారు..

  • తండ్రి పిలుపుతో కప్పులో టీ పట్టుకుని వచ్చింది ఓ చిన్నారి
  • మట్టి వాసనలో పెరుగుతున్న ఆ చిన్నారి (అమేయ)  నిజంగా ఓ అద్భుతం.. 
  • అక్కడ ఉన్న మొక్కల జాతులు, వాటి ఎదుగుదల గురించి గుక్క తిప్పకుండా గడగడా చెబుతుంటే.. అవాక్కవడం నావంతైంది.
  • ఇక ఆ చిట్టితల్లి తెచ్చిన మసాలా టీ ఎంత బాగుందో.. 
  • అసలు.. బాలన్న ఆ ఫార్మ్ కి అమేయ’ కృషి వికాస కేంద్రం అన్న పేరు ఎలా పెట్టారు. ఉద్యోగం మానేసిన తర్వాత ఆయన పడిన కష్టాలు, సాధించిన సక్సెస్‌.. నెక్ట్స్ఎపిసోడ్లో తెలుసుకుందా..



అమేయ.. ఓ అద్భుతం
COMING SOON

journalism : నక్సలిజం నుంచి..

You may also like...

11 Responses

  1. Unknown says:

    రాయటం నేర్చుకునేవాడు ఏల రాసిన బాగుంటుంది చాలా బాగా రాసావు నరేందర్ సూపర్

  2. RAGHU says:

    ఐదేళ్ల కింద నేను సాక్షిలో పనిచేస్తున్నప్పుడు బాలన్న గురించి తెలిసింది. ఆయన సబ్ ఎడిటర్ నుంచి ఫార్మర్ గా మారిన తీరు.. ఆసక్తి కలిగించింది. అమేయ కృషి విజ్ఞాన కేంద్రానికి సందర్శించాలని అనుకున్న. ఇప్పటికీ వీలు కాలేదు. ఫేస్ బుక్ లో ఫాలో అవుతున్నా.

  3. RAGHU says:

    నా సెల్ నంబర్ 9010299031

  4. Unknown says:

    Super Sir….

  5. Unknown says:

    అన్న.. బాలన్న లైఫ్ స్టోరీ బాగుంది..
    అమేయ కోసం వెయిటింగ్..

  6. suresh says:

    బాలన్నా.. శ్రమజీవి చిందించిన చెమట చుక్కలు నేలపై పడి సేద్యానికి ఉపయోగపడినట్టే.
    మీ లైఫ్ అంతే అన్నా.

  7. suresh says:

    బాలన్నా.. శ్రమజీవి చిందించిన చెమట చుక్కలు నేలపై పడి సేద్యానికి ఉపయోగపడినట్టే.
    మీ లైఫ్ అంతే అన్నా.

  8. Unknown says:

    చాలా బాగుంది…

  9. Unknown says:

    యదార్ద వాది లోక విరోధి అన్నది వంద శాతం నిజం‌ బాలన్నా….సూటిగా మాట్లాడేవాడు నేటి సమాజంలో బతుకలేడేమో …ప్రత్యక్షంగా నేనే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *