jangaon tiffin center : కట్టెల అట్టు భలే టేస్టు

jangaon tiffin center : కట్టెల అట్టు భలే టేస్టు
  • ఇంటి వంటను తలపించే టిఫిన్లు
  • అన్ని కట్టెల పొయ్యి మీదే తయారీ
  • మారుమూల కాలనీ క్యూ కడుతున్న జనం

అది పెద్దగా జన సంచారం లేని ప్రాంతం. కొంత మంది కార్మికులు మాత్రమే తిరిగే ఏరియా. అక్కడ ఓ నలుగురు గిరాకీతో వృద్ధ దంపతులు చిన్నగా కాక హోటల్​ను ప్రారంభించారు. అచ్చం పల్లెటూరును తలపించే వాతావరణంలో ఓ చెట్టు కింద ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రారంభించిన ఆ హోటల్​కు ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. అంతగా ప్రత్యేకత ఏమిటని అనుకుంటున్నారా..? కట్టెల పొయ్యి మీద ఆ అమ్మ వేసే అట్టు. అది తింటే ఇంకోటి వేయమ్మా అనాల్సిందే. ఆ పొయ్యిపై ఓ వైపు అట్లు కాలుతుంటే.. మరో వైపు ఇడ్లీలు ఉడుతుకుంటాయి. వీటిలో వాడే పదార్థాలు కూడా రెడిమేడ్​ కాకుండా ఇంట్లో తయారుచేసినవే కావడంతో ఇక్కడ టేస్టు భలే కిక్కుస్తుంది.

jangaon tiffin center : కట్టెల అట్టు భలే టేస్టు
చెట్టు కింద మొదలై..
జనగామ పట్టణంలోని వీవర్స్​ కాలనీలో వ్యవసాయ మార్కెట్​ ఏరియాకు చెందిన మంచాల మురుగేశ్వరి తన ఇంటి ముందు చెట్టు కింద సుమారు ఎనిమిదేళ్ల కింద చిన్నగా టిఫిన్​ సెంటర్​ ప్రారంభించారు. ఆమె టిఫిన్​ తయారు చేస్తే చేతి కింద సాయంగా ఆమె భర్త మనోహర్​ ఉండేవాడు. ఇలా ఇద్దరు వృద్ధ దంపతులు కలిసి ఉదయం 6 గంటలకే లేచి టిఫిన్​ సెంటర్​ నడిపించడం మొదలుపెట్టారు. పాత కాలం పద్ధతిలో వారు కట్టెల పొయ్యి మీద ముందుగా అట్లు పోయడం మొదలుపెట్టారు. పొయ్యి మీద చేసిన వంటకం కావడంతో మంచి రుచి ఉండడంతో కొంచెం గిరాకీ పెరిగింది. దీంతో ఇడ్లి కూడా ప్రారంభించారు. ఆ తరువాత మరింత గిరాకీ పెరగడంతో పూరీ కూడా అందుబాటులోకి తెచ్చారు.


అన్నీ హోం మేడే​..
వీరు టిఫిన్లతో పాటు దానికి సంబంధించిన చట్నీ, కర్రీలు కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తారు. పొయ్యి మీద చేయడంతో పాటు ఈ హోటల్​కు మరో ప్రత్యేకత కూడా ఉంది. నేరుగా వీరు పట్టించిన కారం, పసుపు, మసాలాలే వాడుతారు. అల్లంవెల్లుల్లి కూడా తమ చేతితో తయారుచేసినవే కావడం గమనార్హం. అందుకే ఇక్కడి టిఫిన్లు ఇంటి వంటను తలపిస్తాయి.
వివిధ గ్రామాల నుంచి కస్టమర్లు..
కనీసం హోటల్​కు ఒక పేరు, బోర్డు కూడా ఏర్పాటు చేయని వీరు కేవలం క్వాలిటీని మాత్రమే నమ్ముకున్నారు. ఆ నమ్మకమే అనేక ప్రాంతాల నుంచి కస్టమర్లను ఇక్కడికి రప్పిస్తోంది. రోజుకు సుమారు 200 నుంచి 300 మంది వరకు ఇక్కడ టిఫిన్​ చేస్తుంటారు. జనగామతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన శామీర్​పేట, చీటకోడూరు, చౌడారం, మరిగడి, బచ్చన్నపేట నుంచి ఇక్కడికి కస్టమర్లు వస్తున్నారు. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, డిగ్రీ, బీటెక్​ విద్యార్థులు వస్తుంటారు. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ హోటల్​లో టిఫిన్​ దొరుకుతోంది.


కుటుంబమంతా కలిసి..
ముందుగా ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రమే హోటల్​ను నడిపించేవారు. వీరికి ఇద్దరు కుమారులు నవనీత్, రవీందర్​ ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. ఇద్దరు కొడుకులతో పాటు కోడళ్లు కూడా హోటల్​ నిర్వహణకు సహకరిస్తారు. గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసిన రవీందర్​ ఆ ఉద్యోగం మానేసి తమ సొంత హోటల్​లోనే ఉపాధి పొందుతున్నాడు. మొత్తం కుటుంబ సభ్యులే హోటల్​ను చూసుకుంటారు. గిరాకీ ఎక్కువ కావడంతో ఇటీవలే పూరీలు చేసేందుకు ఓ మాస్టర్​ను నియమించారు. మొత్తంగా ఇంటిల్లిపాది ఉపాధి పొందడంతో పాటు మరొకరికి ఉపాధినిస్తున్నారు. త్వరలోనే సాయంకాలం రాగి సంకటి, నాటుకోటి పులుసు అందుబాటులోకి తెస్తామని మురుగేశ్వరి చెబుతోంది.

jangaon tiffin center : కట్టెల అట్టు భలే టేస్టు

టేస్ట్‌ బాగుంటుంది
– బర్ల శ్రీనివాస్
నా మిత్రుడు ఒకసారి ఇక్కడ అట్లు తినిపించాడు. టేస్టు బాగుంది. అప్పటి నుంచి దాదాపు నాలుగేళ్లుగా ఈ టిఫిన్‌ సెంటర్‌‌కు వస్తున్నా.

jangaon tiffin center : కట్టెల అట్టు భలే టేస్టు

బస్టాండ్‌ నుంచి వచ్చిన
– మిద్దపాక రవి
ఇక్కడ కట్టేల మీద కాల్చే అట్లు భలే టేస్ట్‌గా ఉంటాయి. బస్టాండ్‌ ప్రాంతంలో ఎన్ని టిఫిన్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ఇక్కడకే రుచిగా ఉంటాయి. అందుకే ఇక్కడి వస్తాను.

You may also like...