Ghmc elections : మల్లి.. ఇదేం లొల్లి
Ghmc elections : మల్లి ఏంది రా గీ లొల్లి
పట్నంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల లొల్లి రోజురోజుకూ పెరుగుతోంది.. ప్రస్తుతం రాజకీయాలపై సగటు ఓటరుకు ఉన్న అవగాహన.. అతడి ఆలోచన విధానాన్ని వివరించే ప్రయత్నమే ఈ ఎల్లీ.. మల్లీ.. లొల్లి…
ఎల్లి : ఏం రా మల్లిగా ఎట్లున్నవు రా. గీ పట్టణం చాలా పెద్దగా ఉన్నది. ఏ రోడ్డు ఎటు పొతందో అర్థం కాలే. ఫిల్మ్ నగర్ బస్తీ అంటే గా ఆటోడు తీసుకొచ్చి గి అపోలో దవాఖానా కాడా దింపిండు. ఇంతలో నువ్వు రానే వస్తివి.. పదా నీ ఇంటికి పొదాం.
మల్లి : ఊరిలో ఎలా ఉన్నార్రా ఎల్లి.. అంత మంచేనా. ఊరు, ఆ వాగు, మనం తిరిగిన చేను, చెలకలు గుర్తు వస్తున్నాయిరా.
ఎల్లి : గిదే మరి ఊరికి రమ్మంటే రావు.. నాతో మాత్రం ఊరు మీద ఉన్న ప్రేమను నీ కండ్లతో చూపుతవు. అవునురా హైదరాబాద్ వచ్చాక బానే కూడబెట్టినవట కదా..
మల్లి : ఏం కూడబెట్టుడో ఏమో పేరుకే పైసలు సంపాదించుడు. ఖర్చులు మాత్రం బాగా పెరిగినాయ్. ఇల్లు గడవడమే కట్టమవుతోంది. పదా ఇదే నా ఇల్లు. లోపలికి పోదాం పా..
- వారిద్దరూ రాగానే మల్లి భార్య రత్నం ఎల్లిని ప్రేమగా పలకరించి తాగుమని మంచి నీళ్లు ఇచ్చి వంట గదికి వెళ్లింది. ఎల్లి స్నానం చేయమని చెప్పి మల్లి బజారుకు వెళ్లాడు. ఇంతలో ఎల్లి స్నానం చేసి బయటకు రాగానే రత్నం అతడికి టీ ఇచ్చి తాను ఓ కప్పు తెచ్చుకుంది. ఇద్దరు టీ తాగుతూ ముచ్చట లో పడ్డారు..
ఎల్లి : ఏంటి చెల్లమ్మ పట్టణం అంతా గోలగోలగా ఉంది. ఏమైనా ఎలచ్చన్లు ఉన్నాయా..
రత్నం : అవును అన్నయ్య జీహెచ్‌ఎంసీ (Ghmc elections) ఎలచ్చన్లు ఉన్నాయ్. అందుకే ఇంత హడావుడి.
ఎల్లి : అవునా చెల్లెమ్మ.. ఎవరు గెలుస్తరు మరీ.
రత్నం : ఏమో అన్నయ్య ఎవరు గెలుత్తరో తెల్వదు.
ఎల్లి : ఏంటి చెల్లాయి అలా అంటావ్. మీ సమస్యలు పరిష్కరించే వాళ్లకు ఓటెయ్యవా ఏంది.
రత్నం : అన్న వాళ్లు వాళ్లు తిట్టుకోవడానికే సరిపోతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు.
ఎల్లి : ఏందీ అలా అంటావు. అందరూ బాగానే మాట్లాడున్నారు. ఆ మాటలు విన్న జనం ఈలలు వేయంగా నేను జూసిన.
- ఇంతలో బయటికి వెళ్లిన మల్లి ఇంటికి వచ్చాడు. వారి సంభాషణలో కలుగజేసుకుని.. ఏంటిరా ఎల్లి ఎలచ్చన్ల గురించేనా మీరు మాట్లాడేది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకు..
ఎల్లి : ఎందుకు అలా అంటావు..
మల్లి : ఏళ్ల నుంచి ఇచ్చిన హామీలు ఎక్కడి అక్కడే ఉన్నయ్. రేపు ఎవరో ఒకరు గెలుస్తారు.. తర్వాత మా గల్లీలో ఎవరు కనపడరు. మా బతుకులు మేము బతకాలే..
ఎల్లి : అంటే వాళ్ల చెప్పే మాటలు అబద్ధాలేనా..
మల్లి : అవును ప్రతోడు చేప్పేవి సగం పనులు చేసినా.. మన బతుకులు ఇలా ఉండేవి కాదు. నిత్యం జీవితంతో పోరాడాలి.
ఎల్లి : ఐతే ఎవరికీ ఓటు వేద్దాం అనుకుంటున్నావు..
మల్లి : ఒకడు కులం అంటాడు, మరొకడు మతం అంటాడు, ఇంకోడు ప్రాంతం అంటాడు, మరోడు గల్లీ అంటాడు.. తప్ప ఒక్కడు కూడా మనం మనుషులం అని మాట్లాడడు. పార్టీలు, పగలతో యువతను చెడగొడుతున్నారు. వారి అభివృద్ధికి మాత్రం బాటలు వేయరు. వందల మంది ఉద్యోగం, సద్యోగం లేక.. ఖాళీగా ఉంటున్నారు.
ఎల్లి : ఐతే ఏమంటావ్..
మల్లి : ఇంకేముంది.. ఎవరికో ఒకరికి ఓటు వేయాలి కదా.. ఎవరో ఒకరు గెలవక తప్పదు. మా బాధలు తప్పవు. పదా తిందాం.
ఎల్లి : ఏం తినుడో ఏమో రా.. మనలో చైతన్యం రాకపోతే ఎప్పటికీ మన బతుకులు ఇంతేరా.. రాజకీయ నాయకుల నాటకాలకు మనం బలవుతూనే ఉన్నాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓట్ల కోసం వస్తారు.. మళ్లీ మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుంటారు. ఏ రాజకీయ పార్టీ సొక్కం కాదు. గీ సారి నోటా ఓట్లు పెరిగితే.. నాయకులకు బుద్ధి వస్తది రా..
మల్లి : నువ్వు చెప్పింది వంద శాతం కరెక్ట్. నోటా తోనే మన భవిష్యత్తు అని నా మనసులో మాట నువ్వే చెప్పావు. నోటా కే నా ఓటు రా ఎల్లి.
– K.M యాదవ్, మన చౌరాస్తా
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)