బెదిరింపులకు భయపడం
- తీన్మార్ మల్లన్న ఓ ‘-చోట నయీం’
- కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు
- తమిలసై గవర్నరా.. -బీజేపీ నాయకురాలా..?
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : ‘కాంగ్రెస్ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.. ప్రతి రోజు ఏదో ఒక కేసు పెట్టి భయపెట్టాలని చూస్తోంది. ఎన్ని బెదిరింపులపై ధైర్యంగా ఎదుర్కొంటా..’ అని జనగామ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ గణతంత్ర వేడుకల్లో బీఆర్‌ఎస్‌ను విమర్శించడం సరికాదన్నారు. గవర్నర్ తన హోదాను మరిచి బీజేపీ నాయకురాలిగా మాట్లాడారని మండిపడ్డారు. ఆమె రాజకీయాలు చేయాలంటే గర్నవర్ పదవికి రాజీనామా చేయాలని సూచించారు. గవర్నర్ మాటలను మేధావులు, ప్రజాస్వాముకవాదులు ఇది ఖండించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా కోదండరాం ఓకే చేసిన గవర్నర్, దాసోజు శ్రావణ్‌ను ఎందుకు ఒప్పుకోలదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 1.75 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, కావాలంటే శాఖల వారీగా వివరాలు ఇస్తామని పల్లా పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి భాష మార్చుకో..
సీఎం రేవంత్‌రెడ్డి తాను ఉన్న పదవికి విలువ ఇచ్చి మసలుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. ఒక సీఎం మాట్లాడే భాషేనా అది.. మామూలు కార్యకర్త కూడా అలా మాట్లాడరని అన్నారు. ఇక కాళేశ్వరం మీద పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసలు ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదన్నారు. ఒక మంత్రి1.25 లక్షల ఎకరాలకు నీళ్లు విడుదల చేశామని చెబుతుంటే.. మరొక మంత్రి 50 వేల ఎకరాలకు కూడా నీళ్లు రాలేదు అంటున్నారు. అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే ఊరుకోబోమన్నారు. ఇక తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని పోలీసులు ‘చోటా నయీం’లా తయారు చేసి తనపైకి పంపుతున్నారని పల్లా ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, జిల్లా గ్రంథాల మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్, బీఆర్‌ఆర్ సీనియర్ నేత పసుల ఏబేలు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సింహులు, నాయకులు తిప్పారపు విజయ్, ఉల్లెంగుల సందీప్ తదిరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)