aj interview : ప్యారగాన్‌ చెప్పులతో ఇంటర్వ్వూకు..

aj interview : ప్యారగాన్‌ చెప్పులతో ఇంటర్వ్వూకు..

చేలిక రాజేంద్రప్రసాద్ (సీహెచ్ఆర్పీ) నమస్తే తెలంగాణ ఖమ్మం ఎడిషన్ఇన్చార్జి.. నాకు తెలిసిన జర్నలిస్టు మిత్రుల్లో ఒకరు. బక్క పలచని మనిషైనా ముక్కుసూటి తనం, మొక్కవోని ధైర్యం ఆయన సొంతం. తనకు నచ్చిన దారిలో వెళ్లడంలో ఎందరినైనా ఎదిరించడం, ఎదురు సమాధానం చెప్పడం ఆయన నైజం.. మ్యానరిజమే ఆయనను అనతికాలంలోనే అందలం ఎక్కించింది. ఆర్పీ ఎడిషన్ఇన్చార్జి అయ్యాడని తెలిసిన సందర్భంలో నా ఆనందమే వేరు. నాతో కలిసి పనిచేసిన మిత్రుడు మంచి స్థాయికి వెళ్లాడని ఎంతో సంతోషించా. కానీ ఆయన ముక్కుసూటి స్వభావమో.. సంస్థ ఒత్తిడిలో తెలియదు.. కానీ, ఆర్పీ ఉద్యోగాన్ని దిలేశాడు. అది తెలిసి నేను అవాక్కయ్యా.. ఆలోచనల్లో పడ్డా.. ఏం జరిగిందని ఫోన్చేద్దామనుకున్నా.. కానీ చేయలేకపోయా.. నేరుగా కలిసి మాట్లాడుదామని వెళ్లిన నాకు నోట మాట రాలేదు. ఎడిషన్ఇన్చార్జిగా వార్తలు, పేజీలు దిద్దాల్సిన ఆయన కంగన్హాల్కౌంటర్‌‌లో కూర్చుని గిరాకీని చూసుకోవడం నా మనసును కలిచివేసింది. ఏందన్నా ఇదిఅంటే.. కన్నీటి సుడులను ఆపుకుంటూ.. ఇదే బాగుంది నరీ..అంటూ బరువెక్కిన గుండెతో ఆయన చెప్పిన సమాధానం.. నాకు కొత్త దారిలో పాత మిత్రులుఅనే ఆలోచనకు బాటలు వేసింది.. అసలు ఆర్పీ జర్నలిజం రూట్ కు ఎలా వచ్చాడు. ఏం సాధించాడు. ఏం సంపాదించాడు. ఆయన ఎంచుకున్న దారిలో ఎదురైన ఒడిదుడుకులేంటి.. అని వివరించాలనే చిన్న ప్రయత్నమే కథనం..

హాయ్ ప్రసాదన్న.. బాగున్నారా..

హాయ్‌.. నరీ బాగున్నా..

మీ చ‌దువు నేప‌థ్యం ఏమిటి?

నేను ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కే రెగ్యుల‌ర్ పాస్‌. ఇంట‌ర్‌, డిగ్రీ గ‌ట్టెక్కడానికి అప‌సోపాలు ప‌డ్డా. దండ‌యాత్ర‌లు చేసి ఎలాగోలా పాస్ మెమోలు సాధించా. నా చ‌దువుకు ప్ర‌ధాన అవ‌రోధాలు నిర్ణ‌యాలు స‌రిగా లేక‌పోవ‌డ‌మే. మ‌న‌సులో ఏదో చ‌దువాల‌ని పెట్టుకుని ఎవ‌రో ఏదో చ‌దువుమ‌న్నార‌ని క‌ష్ట‌మైన స‌బ్జెక్టులు తీసుకుని ప‌డ‌రాని పాట్లు ప‌డ్డాను. నాకేమో ఏదో సినిమాలో హీరో చెప్పిన‌ట్టు ఐఏఎస్‌, ఐపీఎస్ లాంటివి కావాల‌ని నిర్ణ‌యాలు ఉండే. కాని చ‌దువ‌డం క‌ష్ట‌మైన గ్రూపులు తీసుకుని బ్రేకులు తీసుకుంటూ చ‌దువు సాగించ‌డానికి స‌మ‌య‌మంతా అయిపోయింది.

మీడియా రంగంలోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు?

andhra jyothi interview : ప్యారగాన్‌ చెప్పులతో ఇంటర్వ్వూకు..

పేప‌రు అన‌గానే క్రికెట్ పేజీ చూడ‌డ‌మే. మా ఊర్లోకి ఒక్క‌టంటే ఒక్క‌టే పేప‌ర్ వ‌చ్చేది. అది కూడా గ్రామ‌పంచాయ‌తీ వారు వేయించే ఈనాడు పేప‌రు. కొద్దిరోజుల‌కు బీఎడ్ పూర్తి చేసిన మా మామ మ‌రో పేప‌రు తెప్పించుకునేది. అప్ప‌ట్లో అంటే 1996 నుంచి 2006 వ‌ర‌కు దాదాపు అన్ని క్రికెట్ మ్యాచ్‌లు చూసేది. ఏ దేశం ఆడినా మ్యాచ్ చూడ‌డం మాత్రం ప‌క్కా. ఇక ఇండియాతో మ్యాచ్ అంటే టాస్ వేయ‌డానికి ముందే టీవీ ముందు కూర్చోవాల్సిందే. బాల్ టు బాల్ చూసేది. అయినా మ‌రుస‌టి రోజు పేప‌ర్‌లో ఏం రాశారో చ‌దువాల‌నే ఎదురు చూపు. ఆ ర‌కంగా పేప‌ర్ రాత‌ల‌పై కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. ఒక్కో రోజు ఒక్కో విధంగా వారు రాసే విధానంపై ఆస్తి క‌లిగింది. జ‌మ్మికుంట‌లోని ఓ కాలేజీకి ఇంట‌ర్ అడ్మిష‌న్ల కోసం క్యాన్వ‌సింగ్ తిరిగే క్ర‌మంలో పేప‌ర్‌లో వ‌చ్చిన నోటిఫికేష‌న్ చూసి వ్యాసం రాయ‌డం, సెల‌క్ట్ అవ‌డం, మ‌ళ్లీ రాత‌ప‌రీక్ష‌కు క‌రీంన‌గ‌ర్‌లో హాజ‌రై ఇంట‌ర్వ్యూ కూడా ఫేస్ చేయ‌డం అక్క‌డ కూడా ఎంపికై ట్రెనీ జ‌ర్న‌లిస్ట్‌గా ఆంధ్ర‌జ్యోతి ప‌దో బ్యాచ్‌లో శిక్ష‌ణ తీసుకోవ‌డం ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి జ‌రిగిపోయాయి.

కాస్త వివరంగా చెబితే బాగుంటుంది..

andhra jyothi interview : ప్యారగాన్‌ చెప్పులతో ఇంటర్వ్వూకు..

ముందే చెప్పిన‌ట్టు ఎలాగోలా ప‌డుతూ లేస్తూ డిగ్రీ పూర్తి అయింది. ఫెయిల్ అయిన సంవ‌త్స‌రాల్లో వ్య‌వ‌సాయంలో అమ్మానాన్నకు చేదోడు వాదోడుగా ఉండ‌డంతో మంచి అనుభ‌వ‌మే వ‌చ్చింది. కానీ, ఊర్లో వాళ్లు మాత్రం అవ్వ‌య్య‌తో ‘ఏంద‌వ్వా.. మీవోడు ఇక ఎవుస‌మే చేత్త‌డా.. మీరు ప‌డుతున్న క‌ట్టం సాల‌దా.. ఎవుసంలో ఏమున్న‌ది.. ఏదో ఓటి ఉద్యోగం సంపాదించుకుంటే జీవితాంతం నీడ‌గ్గూసోని తినొచ్చు. హాయిగా బ‌తుకొచ్చు..’ అనే మాట‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసేవారు. చాలాసార్లు మాకు ప‌నుల‌కు వ‌చ్చిన ద‌గ్గ‌రి వాళ్లు కూడా ముఖం ప‌ట్టుకుని అడిగేవారు. ఏం పిల‌గా ఇంక ఇదే ప‌నా..? చ‌దివేది ఉందా… లేదా..? మంచిగ స‌దువుకో.. స‌దువుకోక‌పోతే మా లెక్క‌నె ఎండ‌ల ఎండుడు, వాన‌ల త‌డ్సుడు.. ఈ క‌ట్టం వ‌ద్ద‌య్యా.. అని స‌ల‌హాలు ఇచ్చేవారు. ఏం చేసినా స‌రే చుట్టాలిండ్ల‌లా, ఊర్లో వాళ్ల నీడ‌కు కూసోని చేసే పని చేయాల‌న‌దే ల‌క్ష్యం . ఇగ ఊళ్లే ఉంటే లాభం లేద‌నుకుని మంది కోస‌మ‌న్నా ఏద‌న్నా చేయాల‌నుకుని నా బాల్య‌మిత్రుడు రాము, నేను క‌లిసి ఎక్క‌డెక్క‌డో తిరిగాం. వ‌రంగ‌ల్‌కు వ‌చ్చి తెలిసిన సార్‌తో ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్‌లో క‌లెక్ష‌న్ బాయ్‌గా కూడా ప్ర‌య‌త్నం చేశాం. కానీ, వాళ్ల‌కు మా ప‌ని తీరు న‌చ్చ‌లేదో ఏమో మ‌మ్మ‌ల్ని ప‌నిలోకి తీసుకోలేదు. ఇక లాభం లేద‌నుకొని మ‌రో మిత్రుడుగాడితో ఓ కాలేజీలో మేమిద్దం క్యాన్వాసింగ్ చేయ‌డానికి సిద్ధం అయ్యాం. ఎందుకంటే వాడు అదే కాలేజీలో కొన్ని సంవ‌త్స‌రాలుగా క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తున్నాడు. వాడు చెబితే ఆ క‌ళాశాల యాజ‌మాన్యం కాద‌న‌లేద‌నే న‌మ్మ‌కంతో ఆ ప్ర‌య‌త్నం చేశాం. ఆ స‌మ‌యంలో మాకు క నీసం జేబు ఖ‌ర్చుల‌కు కూడా ఇబ్బందిగా ఉంటుండే. మా అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించిన కాలేజీ సార్లు స‌రే అని ఒప్పుకున్నారు. ఆ విష‌యాన్ని శంక‌ర్‌గాడు మాకు చెప్ప‌డంతో ప‌ట్ట‌రాని ఆనందంతో ఎగిరి గంతేసిన‌ట్టంత ప‌నిచేశాం. అప్పుడు వాళ్లే ఓ బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్ ఇచ్చి పెట్రోల్‌కు, తిన‌డానికి డ‌బ్బులు కూడా ఇచ్చారు. అస‌లే ఇంటి ద‌గ్గ‌ర అంతంత మాత్రం విలువ‌. ఏ ప‌ని లేకుండా ఊర‌కే తిరుగుతున్నాడ‌న్న అవ‌మానం పొగ్గొట్టుకోవ‌డానికి వెంట‌నే పనిలోకి దిగాం. రోజు ఉద‌యాన్నే కాలేజీకి వెళ్ల‌డం, రిజిస్ట‌ర్‌లో సంత‌కం చేయ‌డం, డ‌బ్బులు తీసుకుని మేమెల్లాల్సిన ఏరియాను తెలుసుకుని ఇద్ద‌రం చేత‌క్ స్కూట‌ర్‌పై బ‌య‌లు దేర‌డం. ఈ క్ర‌మంలోనే కాలేజీలో వేర్వేరు పేప‌ర్లు చూసే అవ‌కాశం ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే ఓ రోజు ఆంధ్ర‌జ్యోతిలో జ‌ర్న‌లిజం కాలేజీ నోటిఫికేష‌న్ ప‌డింది. అనుకోకుండా దానిని చూశాను. (అది 2007 మే నెల అనుకుంటా). అందులోని పూర్తి విష‌యాల్ని జాగ్ర‌త్త‌గా చ‌దివాను. ప్ర‌జాస్వామ్యంలో ఓటు పాత్ర అనే అంశంపై మీదైన స్టైల్‌లో వ్యాసం రాసి కింది అడ్ర‌స్‌కు పంపించండి అని ఉండ‌డంతో వ్యాసం రాసి అడ్ర‌స్‌కు పోస్ట్ చేశాను. వారు వ్యాసం చూసి రాత ప‌రీక్ష‌కు మీరు సెలెక్ట్ అయ్యారు ఫ‌లానా తేదీన క‌రీంన‌గ‌ర్‌లో మీరు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంద‌ని హాల్ టికెట్టు పంపించారు. స‌రే ప‌రీక్ష రాసొద్దామ‌ని క‌రీంన‌గ‌ర్ వెళ్లి ప‌రీక్ష రాశాను. ఆ స‌మ‌యంలో వారిచ్చిన ఓ కాలంలో ఫోన్ నెంబ‌ర్ అడిగితే మా బాపు సెల్ నెంబ‌ర్ ఇచ్చాను(అప్ప‌టికి నాకు ఫోన్ లేదు. మ‌నం బేవార్స్ క‌దా.. న‌వ్వుతూ..).  ఆ త‌ర్వాత మీరు ఇంట‌ర్వ్యూకు ఎన్నిక‌య్యారు. హైద‌రాబాద్ హెడ్ ఆఫీస్‌కు రావాల‌ని మా బాపుకు ఫోన్ చేసి చెప్పారు. ( అప్పుడు మా బాపు ప‌త్తి చేన్లో ప‌నిలో గుంట‌క తోలుతున్నాడు). నేనేమో కాలేజీలో క్యాన్వాసింగ్ త‌ర్వాత ఒక‌టీ అరా క్లాస్‌లు చెప్పే ప‌నిలో బిజీబిజీగా ఉన్నాను. సాయంత్రం ఇంటికి వ‌చ్చాక మాబాపు నాకు విష‌యాన్ని చెప్పాడు. ఊహించ‌న‌ది కాబ‌ట్టి కాస్త ఆనందం అనిపించింది. ఇంట‌ర్వ్యూ తేదీ ఆగ‌స్టు 27 అనుకుంటా.. అంత‌గా గుర్తుకు లేదు. హైద‌రాబాద్ వెళ్లాలంటేనే భ‌యం. పైగా ఇంట‌ర్వ్యూ. మా పెద్ద త‌మ్ముడికి విష‌యం చేర‌వేశాను. (వాడు అప్ప‌టికే హైద‌రాబాద్‌లో పీజీ చేస్తున్నాడు). ఎలాగోలా ముందురోజు బ‌య‌లుదేరి వెళ్లాను. ఇంట‌ర్వ్యూ కానిచ్చి ఇంటికి వ‌చ్చి కాలేజీకి య‌థావిధిగా వెళ్లేవాడిని. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ మూడో తేదీన అనుకుంటా మా బాపు ఫోన్‌కు మ‌ళ్లీ ఫోన్ చేసి మీ వాడు సెలెక్ట్ అయ్యాడు. ఈనెల 7వ తేదీన హైద‌రాబాద్ ఆంధ్ర‌జ్యోతి హెడ్ ఆఫీస్‌లో వ‌చ్చి క‌ల‌వ‌మ‌నండి అని చెప్పి పెట్టేశారు. అలా జ‌ర్న‌లిజంలో తొలి అడుగు ప‌డింది.

మీ ఇంట‌ర్వ్యూ అనుభ‌వాలు..

అస‌లు బోర్డులో ఎవ‌రెవ‌రున్నారో అప్పుడు తెలియ‌దు. నాలాగే  ఆయా జిల్లాల నుంచి వ‌చ్చిన వారంతా ఒక హాలులో కూర్చున్నాం. ఇంట‌ర్వ్యూ(andhra jyothi interview ) అంటే బూట్లు వేసుకుని, నీట్‌గా ట‌క్ చేసుకుని వెళ్లాల‌ని అనుకునేది.

‘నేనేమో ప్యారగాన్‌ చెప్పులు వేసుకుని స‌దాసీదా డ్రెస్ వేసుకుని వెళ్లాను. మా తమ్ముడేమో అన్నా.. ఏం ప‌ర్లేదు అవ‌న్నీ ఎవ‌రూ ప‌ట్టించుకోరు నీవు ధైర్యంగా వె ళ్లు అని చెప్పి లోప‌లికి పంపించాడు.’

వాడు ఆఫీస్ కింద ఓ టీ కొట్టు ద‌గ్గ‌ర కూర్చున్నాడు. నేను భ‌యంభ‌యంగా లోప‌లికి వెళ్లాను. లోప‌లికి వెళ్లే వ‌ర‌కు ఏదో తెలియ‌ని బెరికి. ఎవ‌రేమ‌నుకుంటారో అని టెన్ష‌న్‌. నా లాగా వెయిట్ చేస్తున్న మిత్రులంద‌రికి కేటాయించిన గ‌దిలోకి వెళ్లాక ఓ సీట్లో కూర్చున్నాను. తోటి మిత్రుల కాళ్ల‌ను, వారి డ్రెస్సింగ్ స్టైల్‌ను చూడ‌డం నాకు నేనుగా అంచ‌నా వేసుకోవ‌డం నా మ‌న‌స్సు చేస్తూనే ఉంది. కానీ అక్క‌డ వ‌చ్చిన చాలామంది  నాతోటి మిత్రులు నాకు లాగానే రావ‌డంతో ప‌ర్లేదు ఏం ఇబ్బంది లేదునే అనుకుని కుదురుకున్నాను. ఒక్కొక్క‌రి పేరు పిలువ‌డం, వారు లోప‌లికి వెళ్లి రావ‌డం జ‌రుగుతున్నాయి. ఒక‌టే టెన్ష‌న్. అయినా చూద్దాం. వ‌స్తే రాని లేక‌పోతే లేదు. ఎలాగూ కాలేజీలో దేవేంద‌ర్‌సార్‌ ( స‌ద‌రు క‌ళాశాల క‌ర‌స్పాండెంట్‌) మూడు పీరియ‌డ్లు చెప్పే అవ‌కాశం ఇస్తాడ‌న్న ధీమా ఉంది. అంత‌లోనే రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. అనే పిలుపు. గుండె ఒక‌టే స్పీడుగా కొట్టుకుంటుండ‌గానే లోప‌లికి వెళ్లాను. నా ఎదురుగా ఐదుగురు సార్లు కూర్చున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డున్న ఓ సీటులో కూర్చోబోతే అది అటూఇటూగా కదిలింది. దానిని కే. శ్రీ‌నివాస్ సార్ చేత్తో (అప్పుడాయ‌న శ్రీ‌నివాస్ సార్ అని తెలియ‌దు కానీ త‌ర్వాత క్లాస్‌ల‌కు హాజ‌ర‌వుతుంటూ తెలిసింది.) ప‌‌ట్టుకున్నాడు. మిగ‌తా వారు కూడా ఎవ‌రెవ‌రో కూడా అప్పుడు నాకు తెలియ‌దు. వారు ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం.. నేను తెలిసిన వాటికి స‌మాధానం చెప్ప‌డం. రాని వాటికి తెలియ‌దు సార్ అని చెప్ప‌డం.. ఇదే నా ప‌ని. దాదాపు ఏడు నిమిషాలు ఇంట‌ర్వ్యూ జ‌రిగింది. మీరెళ్లొచ్చు అని వారు చెప్పారు.   ఆ త‌ర్వాత ఇంట‌ర్వ్యూ చేసిన వారిలో వేమూరి రాధాకృష్ణ సార్‌, ఐ.వెంక‌ట్రావ్ సార్‌, రామ‌చంద్ర‌మూర్తి సార్‌, కే శ్రీ‌నివాస్ సార్‌, క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి సార్ ఉన్నారు. ఇదంతా కూడా ప్రారంభ క్లాస్‌కు వీళ్లంతా వ‌చ్చి ప‌రిచ‌యాలు చేసుకున్నారు కాబ‌ట్టి తెలిసింది.

వ‌రంగ‌ల్ ఎలా వచ్చారు?

2007 సెప్టెంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు జ‌ర్న‌లిజం క్లాసులు జ‌రిగాయి. శేఖ‌ర్‌రెడ్డి సార్ ప్రిన్సిపాల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ సార్ వీపీ. 15వ తేదీనే మ‌మ్మ‌ల్ని రిలీవ్ చేశారు. ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డికి వెళ్లాలో శేఖ‌ర్‌రెడ్డి సార్ ముందే చెప్పారు. ముందు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌నుకు వెళ్లాల‌నుకునే వారి ఉంటే చెప్పండంటే ఎవ‌రిమీ చేయెత్త‌లేదు. కానీ ల‌క్ష్మీనారాయ‌ణ రెడ్డి అనే మిత్రుడు స్వ‌చ్ఛందంగా అంగీకారం చెప్పాడు. నేను, సుధాక‌ర్ (ఇప్ప‌టిక ఆంధ్ర‌జ్యోతి వ‌రంగ‌ల్ అర్బ‌న్ డెస్క్ ఇన్‌చార్జి) వ‌రంగ‌ల్‌కు వ‌చ్చాం.16 నుంచి 18 వ‌ర‌కు సెల‌వులు తీసుకుని 19 నాడు రిపోర్టు చేయ‌మ‌ని సార్ చెప్పారు. పంపించే ముందే ‘అక్క‌డ విజ‌య్ అని ఉంటాడు వెళ్లి క‌ల‌వండి నేను చెప్పాను అని చెప్పండి’ అని శేఖ‌ర్‌రెడ్డి సార్.. అప్ప‌టి ఏజే ఎడిష‌న్ ఇన్‌చార్జి పూస‌పాటి విజ‌య్ సార్ నెంబ‌ర్ మాకిచ్చి పంపించారు.

డిసెంబ‌ర్ 19న విజ‌య్‌సార్‌కు ఫోన్ చేసి సాయంత్రం ఆఫీస్‌కు వెళ్లి క‌లిశాం. అప్ప‌టికే శేఖ‌ర్‌రెడ్డి సార్ చెప్ప‌డంతో సార్ మీరేనా అంటూ ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అయిపోయాయి. అప్ప‌టిక‌ప్పుడే విజ‌య్‌సార్ మ‌మ్మ‌ల్ని డెస్క్‌లో ఉన్న అంద‌రికీ ప‌రిచ‌యం చేసి ఇవ్వాళ డ్యూటీ చేస్తారా.. అని అడ‌గ‌డంతో రేప‌టి నుంచి వ‌స్తాము సార్ అని చెప్పి ఇద్ద‌ర‌మూ తిరుగు ప్ర‌యాణం అయ్యాం. అలా ఆంధ్ర‌జ్యోతి వ‌రంగ‌ల్ ఎడిష‌న్‌లో ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది.

తొలి అనుభ‌వాలు ఏమిటి?

నేను, సుధాక‌ర్ ఒకే బండిపై వెళ్లే వాళ్లం.. ఓ రోజు నేను పెట్రోల్ పోయిస్తే మ‌రో రోజు ఆయ‌న పోయించే వాడు. అప్పుడు పెట్రోల్ ధ‌ర లీట‌ర్ రూ.40లే. మ‌డికొండ హెచ్‌పీ బంక్ మా ప‌ర్మ‌నెంట్ బంక్‌. ఇక ఆఫీస్‌లో మొద‌ట్లో సిస్ట‌మ్స్ స‌రిగా లేక‌పోవ‌డంతో విజ‌య్‌సార్ మ‌మ్మ‌ల్ని అబ్జ‌ర్వ‌ర్ చేయ‌ని చెప్పేవారు. ఆ స‌మ‌యంలో డెస్క్‌లో ప్ర‌వీణ్‌సార్ (రంగు ప్ర‌వీణ్‌కుమార్‌) సెకండ్ ఇన్‌చార్జిగా ఉన్నారు. అలాగే, బూర్ల న‌రేంద‌ర‌న్న‌, కేశ‌వ‌న్న‌, రియాజ్ అన్న, కిర‌ణ‌న్న (క‌రీంన‌గ‌ర్‌), తెనాలి శ్రీ‌నివాస్‌ (గుంటూరు), పోటు శ్రీ‌ను (ఖ‌మ్మం), సోమ శ్రీ‌నాథ్‌, అడెం శ్రీ‌నివాస్‌రెడ్డి (సుద్దాల‌) వంటి హేమాహేమీలు ఉన్నారు. వాళ్లంద‌రి అనుభ‌వాలు, సీనియారిటీ త‌ర్వాత మాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి. మొద‌ట నాకు, సుధాక‌ర్‌కు సిస్ట‌మే ఉండేదికాదు. ఎవ‌రైనా రాక‌పోతే ఆ సిస్టాన్ని ఆక్ర‌మించుకునేది. కొత్త‌లో క‌దా.. పేజీలు పెట్టాల‌న్న ఆత్రుత‌. ఆ త‌ర్వాత ఒకే సిస్టాన్ని ఇద్ద‌రం పంచుకునేది. జోన్‌కు రెండు పేజీలు ఉండేవి. నాకు, సుధాక‌ర‌న్న‌కు క‌లిపి మ‌హ‌బూబాబాద్ జోన్ ఇచ్చేవారు. త‌లా ఒక పేజీ పెట్టే వాళ్లం.. అది కూడా ఎడిటోరియ‌ల్ రూంలో సిస్ట‌మ్ లేక‌పోతే షెడ్యూలింగో లేక స‌ర్క్యూలేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ సిస్టంపై ప‌ని చేసే వాళ్లం.. అలా ఒకే జోన్‌ను ఇద్ద‌రం పూర్తి చేసే వాళ్లం. ఆ స‌మ‌యంలో అప్పుడ‌ప్పుడు విజ‌య్ సార్ మ‌మ్మ‌ల్ని ఉద్దేశించి ఆ బ‌య‌టున్న మిత్రుల‌ను జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వ‌మ‌ని చెప్పుపో అని ఆఫీస్ బాయ్‌తో క‌బురు పంపేవాడు. అలా చాలా స‌ర‌దాగా ఆ స‌మ‌యం గ‌డిచిపోయింది. పేజీలు మొత్తంగా పూర్తి అయ్యాక రాత్రి దాదాపు 12 గంట‌ల స‌మ‌యంలో అంద‌రం క‌లిసి భోజ‌నం చేసేవాళ్లం.

ఎంత మంది ఇన్‌చార్జిల ద‌గ్గ‌ర ప‌నిచేశారు?

మేము వ‌రంగ‌ల్ యూనిట్‌లో జాయిన్ అయిన స‌రిగ్గా సంవ‌త్స‌రానికి అంటే 2008 డిసెంబ‌ర్ 19న విజ‌య్ సార్‌కు ఏబీఎన్ చానెల్‌లో అవ‌కాశం వ‌చ్చి హైద‌రాబాద్ వెళ్లాల్సి వ‌చ్చింది. అప్పుడు ఇప్పుడున్న శంక‌ర్‌రావు శంకేసి సార్ ఇన్‌చార్జిగా వ‌చ్చారు.

నాకు, సుధాక‌ర్‌కు ఎడిష‌న్‌లో మొద‌టి గురువు విజ‌య్‌సార్‌. పేజీని ఎలా పెట్టాలో ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకుని నేర్పిన మొట్ట‌మొద‌టి, చివ‌రి ఇన్‌చార్జి సార్ ఆ సారే. విజ‌య్‌సార్ ప‌ని విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాక‌పోయేవారు. ‌ప‌ని విష‌యంలో దండించ‌డం, ప‌ని ముగిసిన త‌ర్వాత స్నేహితుడిగా మాట్లాడ‌డం సారుకే చెల్లుద్ది. ప‌ని స‌క్ర‌మంగా చేసిన త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లాక నా భుజంపై చేయి వేసి న‌డువు నేనేమీ అనుకోను అనేంత ఫ్రీ మెంటాలిటీ. సిబ్బందిని త‌మ్ముళ్ల మాదిరిగా చూసేవారు. పేజీనేష‌న్ విష‌యంలో సార్ ద‌గ్గ‌ర ఎంతో నేర్చుకున్నాను. మేము కొత్త‌గా వెళ్లిన సంద‌ర్భంలోనే కిట్స్ కాలేజీ విద్యార్థినుల‌పై యాసిడ్ దాడి జ‌రిగింది. ఆ రోజు మొద‌టి పేజీ లేఔట్ విష‌యంలో సార్ క‌ష్టాన్ని ద‌గ్గ‌రుండి చూశాం. అది ఎప్పుడూ మ‌ర్చిపోలేని అనుభ‌వం. శ్రీ‌నాథ్ మామ ద‌గ్గ‌రే గంట‌ల త‌ర‌బ‌డి వెన‌కాలే నిల్చొని సార్ త‌న‌కు కావాల్సిన లేఔట్‌ను రాబ‌ట్టుకున్నాడు. సారుకు న‌చ్చే వ‌ర‌కు దాదాపు ప‌ది సార్ల‌కంటే ఎక్కువ‌గానే పేజీనేష‌న్ మార్పించారు. అంతే ఓపిక‌గా శ్రీ‌నాథ్ ప‌ని చేయ‌డం, చివ‌ర‌కు పేలిపోయే ఔట్‌పుట్ రావ‌డం మామూలు విష‌యం కాదు.

ఇక శంక‌ర్‌ సార్‌‌తో వార్త ఎడిటింగ్‌కు సంబంధించిన చాలా విష‌యాలు నేర్చుకున్నాను. కామ‌న్ పేజీ వార్త‌ల‌న్నీ సారే ఎడిటింగ్ చేసి ఫోల్డ‌ర్‌లో వేసేవారు. స‌బ్ ఎడిట‌ర్ డైరెక్ట్‌గా ఐటెమ్‌ను పేజీలో పేస్ట్ చేసి ప్రింట్ ఇవ్వ‌డ‌మే. దాదాపు సార్ దాదాపు రోజుకు 60 నుంచి 75 వార్త‌ల వ‌ర‌కు ఎడిటింగ్ చేసి ఇచ్చేవారు. ఎడిటింగ్ చేసిన వార్త పేజీలో సైజ్‌కు స‌రిపోకుంటే మ‌ళ్లీ తీసుకుని సారే చేసిచ్చేవారు. ఓపిక విష‌యంలో సార్ ద‌గ్గ‌రే నేర్చుకున్నాను. ఎడిటింగ్ కాస్తోకూస్తో తెలిసింది అంటే అది ఆ సార్ చ‌లువే. ఇక్క‌డ శంకేసి సార్ నాకిచ్చిన మ‌రో అద్భుత‌మైన అవ‌కాశం ఏంటంటే క్రైంపేజీ పెట్టే ప‌ని అప్ప‌గించ‌డం. ఆ స‌మ‌యంలో ఆంధ్ర‌జ్యోతిలో క్రైం పేజీ పెట్ట‌డ‌మంటే ఓ స‌వాల్‌. ఓ మంచి అవ‌కాశం. ఎందుకంటే రోజూ ద‌ర్ప‌ణం అనే ఓ విశ్లేష‌ణ‌తో కూడిన ఎడిష‌న్ లాన్‌లో వ‌చ్చేది. అది వ‌చ్చే వ‌ర‌కు 23 జిల్లాల (ఉమ్మ‌డి ఏపీ) ఎడిష‌న్ స‌భ్యులు ఎంతోకొంత టెన్ష‌న్ ప‌డేవారు అనే మాట ఎవ‌రూ కాద‌న‌లేది. ఎందుకంటే అందులో అన్ని జిల్లాల రివ్యూలు, బెస్ట్‌లు, వ‌ర‌స్ట్‌లు, త‌ప్పులు, ఇలా అన్ని కోణాలు వివ‌రిస్తూ విశ్లేష‌ణ ఉండేది. మ‌రీ ముఖ్యంగా క్రైం పేజీపై ప్ర‌త్యేక విశ్లేష‌ణ ఉండేది. వార్త రాసే విధానంపై, ఎడిటింగ్‌పై, వాక్య నిర్మాణాల‌పై, స‌మాచార లోపాల‌పై ఇలా అన్ని విష‌యాల‌పై వివ‌ర‌ణాత్మ‌కంగా వ‌చ్చేది. అలాంటి స‌మ‌యంలో శంక‌ర్‌రావు సార్ డెస్క్‌లో హేమాహేమీలు, చాలా మంది సీనియ‌ర్లు కూడా ఉండ‌గా నాకు వ‌రంగ‌ల్ సిటీ చూసే బాధ్య‌త‌ల‌తో పాటు క్రైంపేజీ పెట్టే అవ‌కాశం ఇచ్చారు.

ఆ స‌మ‌యంలో ఎడిష‌న్ రెండో పేజీ పెట్ట‌డం నాకు నిజంగా పెద్ద స‌వాల్‌. సిటీ ఫోల్డ‌ర్లు చూసుకోవ‌డంతో పాటు క్రైం వార్త‌లు రీరైట్ చేసుకోవ‌డం చాలా ఓపిక నేర్పింది. వార్త‌ను పూర్తిగా రీరైట్ చేసుకునే ఒకే ఒక అవ‌కాశం ఉన్న పేజీని నాకు అప్ప‌గించ‌డం అంత‌పెద్ద ఫోల్డ‌ర్‌ను చూడ‌మ‌ని చెప్ప‌డం సార్ నాకిచ్చిన గొప్ప అవ‌కాశం. మొద‌ట సార్‌తో నా వ‌ల్ల కాదు సార్ అంటే అదే అల‌వాట‌వుతుందిలే అని ధైర్యం చెప్పి నాకు ప‌ని నేర్పించారు. ఎంద‌రో సీనియ‌ర్లు ఉండ‌గా సార్ నాకు సిటీ చూసే అవ‌కాశం క‌ల్పించ‌డం నిజంగా నాకు బాగా క‌లిసొచ్చిన విష‌యంగా నేను భావిస్తా. ఒక విధంగా చెప్పాలంటే నేను ఎడిష‌న్ ఇన్‌చార్జిగా ఎద‌గ‌డానికి అదే నాకు తొలిమెట్టుగా నేను అనుకుంటున్నా.

క్రైంలో ఏమైనా బ్లండ‌ర్స్ జ‌రిగాయా..?

క్రైంపేజీ దాదాపు 15 నెల‌లు పెట్టాను. నేను క్రైం విష‌యంలో రాటు తేలాన‌నే చెప్పుకుంటా. ఎందుకంటే ప్ర‌తీ రిపోర్ట‌ర్‌కు డైరెక్ట్ లైన్లోకి వెళ్లి విష‌యాన్ని తెలుసుకుని వార్త‌ను పూర్తిగా నేను కాంపోజ్ చేసుకునేవాడిని. పైగా నేను చూసిన‌న్ని రోజుల్లో ఎప్పుడూ ఆ పేజీ ద‌ర్ప‌ణంలో పెద్ద‌గా విమ‌ర్శ‌లుగానీ, మ‌రేమైనా డిస్క‌ష‌న్స్ గానీ రాలేదు. అది నా మొద‌టి విజ‌యంగా భావిస్తా. ఇదంతా శంకేసి సార్ తోడ్పాటుతోనే సాధ్య‌మైంది. క్రైంపేజీ గురించి ఎందుకంత‌లా చెబుతున్నానంటే ఆ రోజుల్లో ఆ పేజీకి ఉన్న గుర్తింపు అలాంటిది. ఇప్పుడు ఎన్నో కార‌ణాల‌తో ఆ పేజీయే లేకుండా చేశారు. ఉన్నా అంత‌గా ప్రాధాన్యం ఉంద‌ని నేను అనుకోవ‌డం లేదు. కొన్ని ప‌త్రిక‌లైతే క్రైం వ‌చ్చిందంటే ఆ ఏదో ఒక చోట పెట్టండి మిస్సింగ్ కాకుంటే చాలు అనే ధోర‌ణికి వెళ్లిపోయాయి. కానీ అప్పుడు మొద‌టి పేజీ త‌ర్వాత అతి ఎక్కువ మంది చూసిన పేజీ అంటే అదేనేమో. ఎడిటింగ్‌లో ఆ పేజీ చూడ‌డ‌మే నాకు బాగా క‌లిసొచ్చింద‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాను.

ఇక బ్లండ‌ర్ మిస్టేక్స్ విష‌యానికి వ‌స్తే.. (న‌వ్వుతూ).. రెండు విష‌యాలు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఒక‌టి విజ‌య్ సార్ హ‌యాంలో జ‌రిగితే.. మ‌రోటి శంక‌ర్ సార్ పీరియ‌డ్‌లోజ‌రిగింది. మొద‌టిది.. విజ‌య్‌సార్ ఉన్న‌ప్పుడు ట్యాబ్ మూడో పేజీలో ములుగు డేట్‌లైన్‌తో వ‌చ్చిన వార్త‌కు నేను తాటికాయంత అక్ష‌రాల‌తో ‘విజ్రుంభిస్తున్న విష‌జ్వ‌రాలు’లకు బ‌దులు’ ‘విష జ‌ర్వాలు’ అనే హెడ్డింగ్ తో వ‌చ్చిన వార్త. మ‌రోటి శంక‌ర్‌సార్ ద‌గ్గ‌ర చేస్తున్న‌ప్పుడు రెండో పేజీలో (క్రైంపేజీ) ఒకే వార్త‌ను రెండుసార్లు పెట్ట‌డం. అదేలా జ‌రిగిందంటే రెండు డేట్‌లైన్ల‌తో వార్త వ‌చ్చింది (ఒక‌టి స్టేష‌న్ ఘ‌న్‌పూర్ డేట్‌లైన్‌, మ‌రోటి స్టేష‌న్ ఘ‌న్‌పూర్ టౌన్ అనుకుంటా..) మృతుల పేర్లు కాస్త తేడాగా ఉన్నాయి. చిన్న‌గా అనుమానం వ‌చ్చింది కానీ, ఏమో ఉండి ఉంటుందిలే అనుకుని నా దైనా స్టైల్‌లో బ్యానర్ దొరికింది కాదా అని రెండింటిని కామ‌న్‌గా తీసుకుని పెద్ద‌గా పెట్టాను. తెల్లారి తెలిసింది నేను చేసిన ఘ‌న‌కార్యం ఏపాటిదో అని. శంకర్‌‌రావు సార్ ఒక్క‌మాట కూడా అన‌లేదు. ద‌గ్గ‌ర‌కు పిలిచి ‘చూసుకుని పెట్టాలి క‌దా’ అని చిన్న‌గా చెప్పి పంపించారు. మ‌రో విచిత్ర‌మేమిటంటే నేను క్రైం పేజీ పెట్టే స‌మ‌యంలోనే 2010 మార్చి 28 న నా యాక్సిడెంట్ వార్త‌ను నేను చూడ‌డం. త‌మ్ముడు సురేశ్ ఆ వార్త‌ను లోగో ప‌క్క‌న పెట్ట‌డం ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

మీ జర్నీలో ఏమైనా జ్ఞాప‌కాలు?

ప్ర‌తీ జ‌ర్న‌లిస్ట్ జీవితంలో ఎన్నో కొన్ని త‌ప్ప‌కుండా మ‌ధుర జ్ఞాప‌కాలు ఉంటాయి. నా మ‌ట్టుకు మాత్రం వ‌రంగ‌ల్ జిల్లా అంటేనే గుర్తుకు వ‌చ్చే మేడారం జాత‌ర‌. 2008లో తొలిసారి మేడారం పేజీలు విజ‌య్‌సార్ పెట్టిస్తుంటే ద‌గ్గ‌రుండి చూశాను. ఆ త‌ర్వాత శంక‌ర్‌సార్ మాత్రం 2010లో డెరెక్ట్‌గా న‌న్ను నెట్‌వ‌ర్క్‌ను కోఆర్డినేట్ చేయ‌డానికి డెస్క్ ప్ర‌తినిధిగా న‌న్నే మేడారం పంపించారు. అది నాకెప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభూతి. మేడారం జాత‌ర‌కు వెళ్ల‌డ‌మే మొద‌టిసారి. బ్యూరో సుధాక‌ర్ సార్ ఆధ్వ‌ర్యంలో నెట్‌వ‌ర్క్ టీంతో ప‌నిచేయ‌డం నా అదృష్ట‌మ‌నే భావిస్తా. ఆ త‌ర్వాత 2012, 2014, 2016, 2018 వ‌రుస‌గా ఐదు మేడారం జాత‌ర‌లు నేను చూశాను. డెస్క్ జ‌ర్న‌లిస్ట్‌గా ఆ అవ‌కాశం పొందిన మొద‌టి వ్య‌క్తిని నేనే అనుకుంటాను. ఇక‌, 2016లో న‌మ‌స్తే తెలంగాణ‌లో నెట్‌వ‌ర్క్ ఇన్‌చార్జి మార్కండేయ, సీఈవో శేఖ‌ర్‌రెడ్డి, ఎడిట‌ర్ అల్లం సార్ చేతుల మీదుగా ప్ర‌శంసాప‌త్రం పొంద‌డం మ‌రింత థ్రిల్లింగ్‌. ఏది ఏమైనా మేడారం జాత‌ర‌కు నాకు జీవితంలో మ‌ర‌చిపోని అనుభ‌వం, అనుభూతి.

న‌మ‌స్తే తెణంగాణలోకి ఎలా వచ్చారు?

2011లో ప్ర‌వీణ్‌సార్ న‌మ‌స్తే తెలంగాణ వ‌రంగ‌ల్ ఎడిష‌న్ ఇన్‌చార్జిగా వ‌స్తున్నార‌ని తెలిసింది. అప్ప‌టి భీమారం, స్పోర్ట్స్ విలేక‌రి అర్షం స‌దానందం కాస్త అనుమానంగా ఈ విష‌యాన్ని ముందే నాకు చెప్పారు. నాకు కొద్ది రోజుల‌కు సార్ వ‌స్తున్న విష‌యంలో క్లారిటీ వ‌చ్చింది. మేమంతా (ఏజే యూనిట్ అంతా) ప్ర‌తి ఏటా ఐన‌వోలు జాత‌ర‌కు వెళ్లే వాళ్లం. వ‌ర్ధ‌న్న‌పేట రిపోర్ట‌ర్ ర‌మేశ్‌గారు మాకు దేవాల‌యంలో ద‌ర్శ‌నాలు చేయించి అతిథి మ‌ర్యాద‌లు చేసి పంపించేవారు. ఆ రోజు ఐన‌వోలులో ఉన్న‌ప్పుడే ప్ర‌వీణ్‌సార్ వ‌రంగ‌ల్‌కు వ‌చ్చాన‌ని, ఎక్క‌డున్నావ‌ని ఫోన్  చేశారు. మ‌రుస‌టి రోజు సార్‌ను క‌లిసి విష‌యం తెలుసుకోవ‌డం, న‌మ‌స్తే తెలంగాణ‌లో  2011 మే 12 జాయిన్ కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. న‌మ‌స్తేకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు బ్యూరో సుధాక‌ర్ సార్ ప్ర‌సాద్‌గారూ మీరు వెళ్ల‌డం నాకు మ‌ట్టుకు ఇష్టం లేదండి.. మీరు ఇంకొన్నాళ్లు ఏజే (ఆంధ్రజ్యోతి)లోనే చేస్తే బాగుంటుదేమోన‌ని స‌లహా కూడా ఇవ్వ‌డం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని విష‌యం. ఆయ‌న స్థాయికి స్నేహితుడిలాగా మాట్లాడే తీరుతో చాలా బాధ‌నిపించింది. కాని అప్ప‌టికే జాయిన్ అయ్యాను సార్‌, వెళ్తాను అని సెల‌వు తీసుకుని వెళ్లిపోయాను.

andhra jyothi interview : ప్యారగాన్‌ చెప్పులతో ఇంటర్వ్వూకు..

ఎడిష‌న్ ఇన్‌చార్జిగా మీ అనుభ‌వాలు?

ఆంధ్రజ్యోతిలోని అనుభ‌వాలు న‌మ‌స్తే తెలంగాణ‌లో బాగా ప‌నికి వచ్చాయి. న‌మ‌స్తేలో కూడా వ‌రంగ‌ల్ సిటీ చూశాను. ఆ త‌ర్వాత కొత్త జిల్లాలు అయిన త‌ర్వాత అర్బ‌న్ జిల్లా ఇన్‌చార్జిగా ప‌నిచేశాను. ఈ క్ర‌మంలోనే 2019 ఆగ‌స్టు 30వ తేదీన ఖ‌మ్మం ఎడిష‌న్ ఇన్‌చార్జిగా వెళ్లాల‌ని హైద‌రాబాద్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. కొద్దిసేపు న‌మ్మ‌లేక‌పోయాను.  విష‌యాన్ని ఎడిష‌న్ ఇన్‌చార్జి హ‌రీశ్ గారితో పంచుకున్నాను. ఆయ‌న బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పి వెళ్లిపొమ‌న్నారు. కానీ, నా భార్య గ‌ర్భ‌వ‌తి. తీవ్రంగా ఇబ్బందిప‌డింది. వెళ్ల‌డం ఇష్టం లేకున్నా త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో వెళ్లాను. సెప్టెంబ‌ర్ 10వ తేదీన పూర్తిస్థాయి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఖ‌మ్మం ఒక కొత్త అనుభ‌వాన్ని ఇచ్చింది. అది పూర్తిగా విరుద్ధ‌మైన వాతావ‌ర‌ణం. నా మ‌ట్టుకు నాకు అది తెలంగాణ కాదు. ఇటు ఏపీ అనిపించ‌దు. అక్క‌డి రాజ‌కీయం వేరు. అక్క‌డ ప‌నిచేయ‌డం ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌ పీరియ‌న్స్‌. చేసింది త‌క్కువ కాల‌మే అయినావ‌రంగ‌ల్ వంటిచోట ప‌దేళ్లు రాని అనుభ‌వాలు, ఖ‌మ్మంలో నెల‌ల కాలంలోనే నేర్చుకున్నారు. మొత్తంగా  ఎన్నో ఖ‌మ్మం ఓ డిఫ‌రెంట్‌.

ఖ‌మ్మంలో ఒత్తిడులు ఉన్నాయ‌నేది నిజ‌మేనా..?

ఒత్తిడి లేకుండా ఎక్క‌డా ప‌ని సాఫీగా సాగ‌దు. ఎంత ఒత్తిడి ఉంటే అంత బాగా షైన్ అవుతామ‌నేది నా న‌మ్మ‌కం. నాకు ఒత్తిడి ఉండేది. ఎలాగంటారా.. క‌రోనా ప‌రిస్థితుల ద్రుష్ట్యా అన్ని యాజ‌మాన్యాలు సిబ్బందిని త‌గ్గించిన విష‌యం మీకు తెలిసిందే. అందులో భాగంగా న‌మ‌స్తే సైతం అదే ప‌ని చేసింది. అట్ ద‌సేమ్ టైం ట్యాబ్‌లైడ్ మ‌ళ్లీ తీసుకొచ్చింది. సిబ్బంది త‌గ్గ‌డంతో ప‌ని ఒత్తిడి పెరిగింది. మంచి ఔట్‌పుట్ ఇవ్వ‌డానికి కాస్త ఇబ్బందిగా మారింది. ఈ క్ర‌మంలోనే నాకు ఇంటి వ‌ద్ద కాస్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని ఇదివ‌ర‌కే చెప్పాను. దీంతో సెల‌వులు పెట్ట‌డం ఎక్కువైంది. పెద్ద‌సార్లు లైన్లోకి వ‌చ్చి ఇన్ని సెల‌వులా.. ఏంటి.. అలా.. అని ఒక‌టి రెండు సార్లు మంద‌లించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. కానీ నాకు నా కుటుంబ అవ‌స‌రాలు ముఖ్యం క‌దా.. అందుకే ఎడిష‌న్ ఇన్‌చార్జిగా స‌రైన బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ జ‌ర‌గ‌డం లేద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాను. పైగా జీతం విష‌యంలో కూడా ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

మరో వైపు క‌రోనా నేప‌థ్యంలో రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాను. నా కుటుంబం హ‌న్మ‌కొండ‌లో, నేను ఖ‌మ్మంలో. ర‌వాణా వ్య‌వ‌స్థ మంచిగా ఉన్న‌ప్పుడు ఏ మాత్రం క‌ష్టంగా లేకుండే. కానీ, క‌రోనా కార‌ణంగా ఎక్క‌డికక్క‌డ స్తంభించ‌డంతో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 2019 అక్టోబ‌ర్ 20న బాబు పుట్టాడు. చిన్న పిల్లాడితో పాటు కూతురును ప‌ప‌ట్టుకుని నా భార్య ఒక్క‌తే ఉండ‌డం మ‌రింత క‌ష్ట‌మైంది. క‌రోనా విజృంభిస్తున్న ద్రుష్ట్యా నేను ప‌ది రోజుల‌కో, ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి ఇంటికి వ‌చ్చినా ఇంట్లో గ‌డ‌ప‌డానికి చాలా భ‌య‌మేసేది. ఇన్ని క‌ష్టాల న‌డుమ నాకు అక్క‌డ ప‌ని చేయ‌డం ఇబ్బందిగా అనిపించి అన్ని ఆలోచించుకునే ఉద్యోగాన్ని వ‌దులుకోవాల‌నే గ‌ట్టి నిర్ణ‌యానికి వ‌చ్చాను.

మ‌ళ్లీ అవ‌కాశం వస్తే..?

నేను ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ జ‌ర్న‌లిస్టునే.. అవ‌కాశం ఉంటేనే త‌ప్ప‌కుండా వెళ్తాను. అవ‌కాశం దానంత‌ట అదే వ‌స్తుంద‌ని నేను అనుకోను. మ‌న‌మే క‌ల్పించుకోవాలి. త‌ప్ప‌కుండా నెట్‌వర్క్‌ ప్ర‌య‌త్నాలు చేస్తా. ఇన్నేళ్లు డెస్క్‌లో చేశాను. ఇప్పుడు కొత్త‌గా నా ప‌నిని నేను మెరుగుప‌ర్చుకోవ‌డానికి రిపోర్టింగ్ వైపు అడుగులు వేస్తాను. అవ‌కాశం త‌ప్ప‌కుండా వ‌స్తుంది అనే న‌మ్మ‌కం నాకుంది. వ‌స్త‌ది కూడా. చూద్దాం..

ఇప్పడు ఏం చేస్తున్నరు.. టైం ఎలా గ‌డుపుతున్నారు?

గడపడం ఏంది నరీ..(నవ్వుతూ..).. నేను అప్పుడు ఎలా ప్యారగాన్‌  చెప్పులతో ఇంటర్వ్యూకు (andhra jyothi interview ) వెళ్లానో.. ఎడిషన్‌ ఇన్‌చార్జిగా రాజీనామా చేసి ఇప్పడు ఇంటికి అలాగే వచ్చాను. బతకడం తప్ప ఈ ఫీల్డ్‌లో సంపాదించింది లేదు. వెనకేసింది లేదు.. 

కాలంతో పోటీ పడే డ్యూటీని వదిలి ప్ర‌స్తుతానికి నాకున్న శారీ సెంట‌ర్‌లో ప‌నితో బిజీబిజీగా మారాను. మా బాబును ప‌ట్టుకోవ‌డం, మా ఆవిడ ఇంటికెళ్తే నేను షాపులో కూర్చోవ‌డం నాకు నిరంత‌ర షెడ్యూల్ అయింది. కాస్త స‌మ‌యం చూసుకుని నాదైన ఆలోచ‌న‌తో మ‌ళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో అంద‌రి ముందుకు రావ‌డానికి ప్ర‌ణాళికా ర‌చ‌న చేస్తున్నాను. పెద్ద‌ల సూచ‌న‌లు, మిత్ర బృందంలోని ప‌లువురి స‌హ‌కారం, శ్రేయోభిలాషుల తోడ్పాటుతో త్వ‌ర‌లోనే అంద‌రికీ క‌నిపిస్తా..

.. అంటూ ఆర్పీ తన మనోగతాన్ని వినిపించాడు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఏదో వెలితి కొట్టొచ్చినట్టు కనిపించింది. కానీ, ఈ కరోనా కాలంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని.. హాయిగా భార్యా, పిల్లలతో ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటూ.. ఉన్న దాంట్లో తింటూ ఉండడం బెటరే అనిపించింది.

ఓకే  ఫ్రెండ్స్ బైబై..

మరిన్ని కథనాలకు క్లిక్‌ చేయండి

వచ్చే వారం మరో అలసిన కలం యోధుడి కథతో
మీ ముందుకొస్తా..
– ఉప్పలంచి నరేందర్, డెస్క్‌ జర్నలిస్ట్

 

You may also like...

15 Responses

  1. RAGHU says:

    బాగుంది.. సూపర్.. మంచి ప్రయత్నం

  2. Unknown says:

    Super anna?????

  3. Unknown says:

    చాలా బాగుంది నరేందర్ మంచి ఆలోచనతో మొదలు intresting ga undhi

  4. MOUNA GEETAM says:

    జీతానికీ జీవితానికి మధ్య నలిగే మన బతుకులకు అక్షరాలు అందించావు…. నీ ప్రయత్నానికి పరిపరి దండాలు నరేందర్…

  5. Unknown says:

    సూపర్బ్..

  6. hi how r U ? షాల మంచిగున్న‌ది… మంచి ప్ర‌య‌త్నం.. కానీయుండ్రి..

  7. కలయోధుల కష్టాలను కండ్లకు కట్టినట్లుగా ఉంది. మీ ప్రయత్నం కు అభినంధనలు…

  8. చాలా బాగుంది..బ్రదర్..ఇంటర్వ్యూ…కలంయోధుల అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న మీకు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *