హామీల అమలుకు గడువు ఇస్తాం..
- శ్వేత పత్రాల పేరుతో కాలయాపన
- అప్పులు చేశాం.. ఆదాయాన్ని పెంచాం..
- కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, చౌరాస్తా : ప్రజల తీర్పును గౌరవిస్తాం.. ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆరు నెలల సమయం ఇస్తాం అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాడుతామని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల కృతజ్ఞత, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం సిరిపురం గార్డెన్లో జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం, ఆస్పత్రి భవన నిర్మాణాన్ని చేపట్టి వైద్య సేవలు అందించడం. నేటికీ సాగునీరు అందని 35 గ్రామాలకు ఏడాదిలోగా గోదావరి జలాలను అందించడం, ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కొనసాగించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కేవలం 6 గ్యారంటీలలో ఒక్కటి మాత్రమే అమలు చేసిందని అన్నారు. రైతుబంధు, రుణమాఫీ చేస్తాదని ఆశించిన ప్రజలకు మొండి చేయి చూపిందన్నారు. శ్వేత పత్రాలు పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేయొద్దని అప్పులు చేసిన మా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచిందని విషయాన్ని విస్మరించొద్దన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలని కోరారు. వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుంటానని శ్రీహరి హామీ ఇచ్చారు. నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా గ్రామాల్లో తిరిగే మీరు విలువలను కాపాడుకునేందుకు డిపాజిట్లు పెట్టి పంచాయతీలు చేసే పనులకు స్వస్తి చెప్పాలని, తాగుడుకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, ముఖ్య రమేష్ నాయకుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, చిలుకూరు గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఎంపీపీలు సరిత బాలరాజు, రేఖ గట్టయ్య, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బిల్దే వెంకన్న, బూర్ల లత శంకర్, సింగపురం జగన్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, ఎంపీటీసీలు గన్ను నరసింహులు, పురమని రజాక్, బెల్లం వెంకటస్వామి, మెట్టిల్లి రమేష్, రంగు రమేష్, రూప్ల నాయక్, కనకం రమేష్, నేరటి ప్రభాకర్, రాపోలు మధుసూదన్ రెడ్డి రెండు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.