Jn zp meeting : మొక్కబడిగా
మొక్కబడిగా జనగామ జడ్పీ మీటింగ్
– ఎజెండాలో 32 అంశాలు..
– చర్చించింది కేవలం ఎనిమిదే..
జనగామ, చౌరాస్తా : జనగామ జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ మొక్కబడి సాగింది. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ మీటింగ్‌లో 32 ఎజెండా అంశాలను పొందుపర్చారు. కానీ, కేవలం ఏడు, ఎనిమిది మాత్రమే చర్చరించి మమా అనిపించారు. ముందుగా వ్యవసాయ శాఖపై చైర్మన్ చర్చ ప్రారంభించగా తరిగొప్పుల జడ్పీటీసీ పద్మజారెడ్డి ఇటీవల నకిలీ విత్తనాలు ఎక్కువగా అయ్యాయని, నాటు వేసిన 45 రోజుల్లోనే మొలకలు చనిపోతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. బొత్తలపర్రిలో దాదాపు 10 ఎకరాల్లో నష్టం జరిగిందని వివరించారు. ఇందుకు డీఏవో వినోద్‌కుమార్ సమాధానం ఇస్తూ శాస్త్రవేత్తలతో సర్వే చేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇక రఘునాథపల్లి ఎంపీపీ వరలక్ష్మి మాట్లాడుతూ తమ మండలంలోని కోమల్లలో రైతు బీమా కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారని వివరించారు.
ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఉద్యానవన శాఖపై జరిగిన చర్చలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు సూచనలు చేశారు. ఆయిల్‌పామ్ సాగుకు అయ్యే ఖర్చు, దాని వల్ల వచ్చే లాభాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 6 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు టార్గెట్‌గా పెట్టుకోగా ఇప్పటి వరకు 1900 ఎకరాలు కంప్లీట్ చేసినట్లు హార్టీకల్చర్ ఆఫీసర్ లత వివరించారు. పూర్తి స్థాయిలో టార్గెట్ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
మిషన్ భగీరథపై జరిగిన చర్చలో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ వివరించారు. అదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ జడ్పీటీసీ మారపాక రవి కలుగ జేసుకుని తాగునీటి ట్యాంకులు క్లీనింగ్ చేయడం లేదని సభ దృష్టి తెచ్చారు. లింగాలఘణపురం మండలంలో చాలా చోట్ల భగీరథ నీళ్లు రావడం లేదని, దీంతో బోర్ వాటర్ తాగుతున్నారని జడ్పీటీసీ వంశీచందర్‌రెడ్డి, ఎంపీపీ జయశ్రీ సభ దృష్టి తెచ్చారు. కొడకండ్ల జడ్పీటీసీ బేబీ మాట్లాడుతూ తమ మండలంలో తాగునీటి బాగా సరఫరా చేస్తున్నారని, కానీ జనంలో ఆ నీటిపై నమ్మకం లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు.
రూ.75 కోట్ల బడ్జెట్ ఉంది : కలెక్టర్ శివ లింగయ్య
మన ఊరు మన బడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని విద్యాశాఖపై జరిగిన చర్చలో కలెక్టర్ శివ లింగయ్య చెప్పారు. జిల్లాలో ఈ పథకం కింద 176 స్కూళ్లను డెవలప్ చేసేందుకు టార్గెట్ పెట్టుకోగా 100 స్కూళ్లలో పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. మిగతా వాటిలో కూడా త్వరగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆ తర్వాత విద్యుత్‌పై జరిగిన చర్చలో లింగాలఘణపురం మండలం జడ్పీటీసీ వంశీచందర్‌రెడ్డి తమ మండలంలో రైతుల నుంచి ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రజాపంపిణీ, హెల్త్ డిపార్ట్ మెంట్‌పై చర్చ జరిగింది. జిల్లాకు మంజూరై మెడికల్ కాలేజీ కోసం ధర్మకంచలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిశీలించినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సూగుణాకర్రాజు వివరించారు. వైద్య సేవల్లో మన జనగామ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నామని తెలిపారు. డెలివరీల్లో మన టార్గెట్ 250 అయితే సరాసరిగా 450 డెలివరీల్లో చేస్తూ ఆరు నెలలుగా రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉన్నట్లు వివరించారు.
సమన్వయంతో పనిచేయాలి : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. సీఎం కేసీఆర్ విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వాటిని ప్రజలకు సరిగా అందేలా ప్రతీ ఆఫీసర్ కృషి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)